టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా మోదీ!
రీడర్స్ పోల్‌లో మోదీ గెలుపు
న్యూయార్క్: టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కోసం జరిగిన రీడర్స్ పోల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. ఆదివారం రాత్రి ముగిసిన ఈ పోల్‌లో మోదీ 18 శాతం ఓట్లు సాధించారు. 2016కు సంబంధించిన ఈ పోల్‌లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లాంటి వారు పోటీలో ఉన్నారు. ఈ ఓటింగ్‌లో ఒబామా, ట్రంప్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేలకు 7 శాతం చొప్పున ‘యెస్’ ఓట్లు వచ్చారుు. ఇక హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, ఫేస్‌బుక్ ఫౌండర్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు లభించారుు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరనేది టైమ్ ఎడిటర్ త్వరలో నిర్ణయిస్తారు.
అయితే ఆన్‌లైన్ పోల్ ఫలితాలు ప్రపంచం దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ ఏడాది దిశానిర్దేశకులపై అదో ముఖ్యమైన గవాక్షం లాంటిదని టైమ్ పేర్కొంది. కాగా, ఆన్‌లైన్ పోల్‌లో విజయం సాధించడం మోదీకి ఇది రెండోసారి. చెడు లేదా మంచి విషయాల్లో వార్తలను, ప్రపంచాన్ని ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తిని ప్రతిఏటా టైమ్ పత్రిక ఎంపిక చేస్తుంది. మోదీకి భారత్ నుంచేగాక అమెరికా రాష్ట్రాలైన కాలిఫోర్నియా, న్యూజెర్సీ నుంచి కూడా ఓట్లు వచ్చాయని ఓటింగ్ నిర్వహించిన అపెస్టర్ పేర్కొంది. పోల్‌లో మోదీ తొలిస్థానాన్ని కై వసంచేసుకోవడాన్ని కొందరు కేంద్రమంత్రులు స్వాగతించగా, ఇదే సర్వేను పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో చేసి ఉంటే మోదీ పాపులారిటీ తగ్గిపోయేదని విపక్షాలు వ్యాఖ్యానించారుు. నోట్లు రద్దు చేసి ఏడాదిలో ఎవరూ చేయనట్లుగా ఒకే దెబ్బతో దేశప్రజలందరినీ కష్టాల్లోకి నెట్టిన మోదీని ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ కాదని ఎవరంటారు? అని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యంగ్యంగా అన్నారు.