టైమ్ సర్వే: ట్రంప్, ఒబామాలను దాటేసిన మోదీ!
టైమ్ సర్వే: ట్రంప్, ఒబామాలను దాటేసిన మోదీ!
Published Mon, Dec 5 2016 12:00 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
ప్రపంచంలో వివిధ నాయకులు, కళాకారులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులందరిలో అగ్రగామి ఎవరంటే... భారత ప్రధాని నరేంద్రమోదీయేనని తేలింది. ఈ విషయమై టైమ్ పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే.. మోదీయేనని ఎక్కువమంది ఓటేశారు. అయితే, టైమ్ పత్రిక ఎడిటర్లు మాత్రం ఇంకా తమ పత్రిక తరఫున పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఎవరనే విషయాన్ని నిర్ణయించాల్సి ఉంది. ఆ నిర్ణయం ఈనెల 7వ తేదీన వెలువడనుంది. ప్రస్తుతానికి ప్రజల సర్వే ఫలితాలు మాత్రం వెల్లడయ్యాయి.
ఆదివారం అర్ధరాత్రితో ఈ సర్వే గడువు ముగిసేసరికి నరేంద్రమోదీకి అత్యధికంగా 18 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, జూలియన్ అసాంజే.. వీళ్లందరికీ కూడా కేవలం 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హిల్లరీ క్లింటన్‌కు 4 శాతం, మార్క్ జుకర్‌బర్గ్‌కు 2 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయులతో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ ప్రాంతాల వారు కూడా మోదీకి అనుకూలంగా బాగా ఓటుచేసినట్లు తెలుస్తోందని ప్రస్తుత సర్వే వివరాలను విశ్లేషించిన యాప్‌స్టర్ సంస్థ తెలిపింది. టైమ్ పత్రిక ప్రతియేటా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఎవరన్న విషయమై సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ యేడాది ఓపెన్‌టాపిక్, ఐబీఎం సంస్థలతో కలిసి టైమ్ ఎడిటర్లు తుది విజేతను నిర్ణయిస్తారు.
Advertisement