మాస్కో : రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో పురాతన బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటికే 9 మరణించగా... శిథిలాల కింద ఇరుక్కున వారి జాడ ఇంకా తెలియడం లేదు. సోమవారం ఉదయం భవనంలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు తగ్గిపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలో రక్షణా బృందాలు తీవ్రంగా శ్రమించి శిథిలాల కింద ఇరుక్కున్న పదకొండు నెలల బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. సుమారు 36 గంటలపాటు రాళ్ల కింద ఇరుక్కున్న ఆ బాలుడు చలికి గడ్డకట్టుకుపోయినప్పటికీ ఇంకా శ్వాస ఆడుతోందని తెలిపాయి. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బాలుడి తండ్రి రక్షణా బృందాలకు కృతఙ్ఞతలు తెలిపాడు. అంతటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డ తన కుమారుడు మృత్యుంజయుడని, అతడు కచ్చితంగా బతుకుతాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా సోమవారం ఉదయం ఒక్కసారిగా భవనంలో పేలుడు సంభవించడంతో మూడేళ్ల కుమారుడితో కలిసి తాను బయటికి పరిగెత్తానని సదరు బాలుడి తల్లి పేర్కొంది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేకపోవడంతో చిన్న కుమారుడుని బయటికి తీసుకువెళ్లాడేమోనని భావించానని తెలిపింది. ఈ కారణంగానే తన చిన్నారి ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక... గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ నిర్ధారించింది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment