baby survived
-
36 గంటలపాటు... మైనస్ 22 డిగ్రీల చలిలో
మాస్కో : రష్యాలోని మాగ్నిటోగొరస్క్ నగరంలో పురాతన బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటికే 9 మరణించగా... శిథిలాల కింద ఇరుక్కున వారి జాడ ఇంకా తెలియడం లేదు. సోమవారం ఉదయం భవనంలో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 22 డిగ్రీలకు తగ్గిపోవడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలో రక్షణా బృందాలు తీవ్రంగా శ్రమించి శిథిలాల కింద ఇరుక్కున్న పదకొండు నెలల బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. సుమారు 36 గంటలపాటు రాళ్ల కింద ఇరుక్కున్న ఆ బాలుడు చలికి గడ్డకట్టుకుపోయినప్పటికీ ఇంకా శ్వాస ఆడుతోందని తెలిపాయి. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బాలుడి తండ్రి రక్షణా బృందాలకు కృతఙ్ఞతలు తెలిపాడు. అంతటి విపత్కర పరిస్థితుల నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డ తన కుమారుడు మృత్యుంజయుడని, అతడు కచ్చితంగా బతుకుతాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. కాగా సోమవారం ఉదయం ఒక్కసారిగా భవనంలో పేలుడు సంభవించడంతో మూడేళ్ల కుమారుడితో కలిసి తాను బయటికి పరిగెత్తానని సదరు బాలుడి తల్లి పేర్కొంది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేకపోవడంతో చిన్న కుమారుడుని బయటికి తీసుకువెళ్లాడేమోనని భావించానని తెలిపింది. ఈ కారణంగానే తన చిన్నారి ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక... గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని జాతీయ భద్రతా సంస్థ ఎఫ్ఎస్బీ నిర్ధారించింది. కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
'ఇది నిజంగా దేవుడి లీల'
జుబా : దక్షిణ సుడాన్లో కూలిపోయిన కార్గో విమాన ప్రమాదంలో అనూహ్యంగా తండ్రీ కూతుళ్లిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 37 మందిని పొట్టన బెట్టుకున్న ఈ ప్రమాదంలో 13 నెలల పసిపాప నిలౌ స్వల్పగాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుడాన్ రాజధాని జుబాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. స్థానిక టీవీ ప్రతినిధి ఆచల్ డెంగ్ తొలిసారిగా పాపను గుర్తించారు. అపస్మారక స్థితలో పడి ఉన్న తండ్రి ఛాతీపై గాయాలతో పడి ఉండడన్ని ఆమె గమనించి రక్షణ దళాలకు సమాచారం అందించారు. ఒక కాలు విరిగి, నుదురుమీద స్వల్ప గాయాలతో చిన్నారి బయటపడింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో చిన్నారి తల్లి, చెల్లి ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా దేవుడి లీల అంటూ డెంగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయినా.. కూతురిని తన గుండెలపై వేసుకుని రక్షించాడని తెలిపారు. పాప తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత పాప వివరాలు తెలిపాడన్నారు. కాగా నివాసం ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 37మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా ,మరికొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిమితికి మించిన ఎక్కువ పరిమాణంలోసరుకులు తీసుకెళ్లడం వల్లనే నైలు నది సమీపంలో విమానం కూలిపోయిందని దేశ రవాణా శాఖమంత్రి తెలిపారు. మృతుల సంఖ్య 37కి పెరిగిందని ప్రకటించారు. విచారణకు ఆదేశించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు అనుమతిలేని ఈ విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని తెలిపారు.