
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : సోషల్ మీడియా సమాచారానికి సంబంధించి సదరు సోషల్ మీడియా సంస్థలు తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ శాతం మంది అమెరికన్లు నమ్మకం కలిగిలేరని తాజా సర్వేలో వెల్లడైంది. సమాచారం విషయంలో సోషల్ మీడియా సంస్థల నిర్ణయాలకంటే ప్రభుత్వ నిర్ణయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ‘గల్లాప్, నైట్ ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన సర్వే పేర్కొంది. మంగళవారం ఈ సర్వేకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సోషల్ మీడియా వేదికలపై అన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పించాలని, శిక్షార్హమైన వాటిని కూడా సమ్మతించాలని మూడింట రెండు వంతుల అమెరికన్లు కోరారు. అయితే సర్వేలో పాల్గొన్న 85శాతం మంది ఉద్ధేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించాలన్నారు. ( హింసాత్మక ఘటనపై స్పందించిన అమెరికా)
రానున్న అధ్యక్ష ఎన్నికలు, రాజకీయ సమస్యలపై తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించాలని 81 శాతం మంది కోరారు. హానికరమైన సమాచారానికి సంబంధించిన విషయంలో సోషల్ మీడియా సంస్థల తీరును తప్పుబట్టారు. 71 శాతం మంది డెమోక్రట్స్, 54 శాతం మంది ఇండిపెండెంట్స్ సదరు సోషల్ మీడియా సంస్థలు సమాచారం విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవటం లేదని అభిప్రాయపడ్డారు. తమకు సంబంధించిన సమాచారంపై సోషల్ మీడియా సంస్థల నిర్ణయాలను 80 శాతం మంది నమ్మటం లేదు. ప్రభుత్వమే సమాచార పరిధిని నిర్ణయించాలని డెమోక్రట్స్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment