సాలీడు భయంతో నడుస్తున్న కారులోంచి దూకేసి.. !
ఇండియానా: బొద్దింకను, బల్లిని చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తూ పారిపోయే మహిళలను చాలాసార్లు చూసి ఉంటాం. కానీ, నడుస్తున్న కారులోంచి అలాంటి భయంతో దూకేసిన మహిళలను చూడటం మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. ఇండియానాలో మాత్రం ఓ మహిళ ఒక్కసారిగా తాను నడుపుతున్న కారు స్టీరింగ్ను వదిలేసి, కారులో ఉన్న కొడుకును మరిచిపోయి ఆ పనే చేసింది. ఏకంగా కారు నడుస్తుండగానే బయటకు దూకేసింది. అయితే అదృష్టం బాగుండి ఆ పిల్లాడు చిన్నపాటి గాయాలతో.. తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసా?...
సిరాక్యూజ్ చెందిన ఎంజెలా కిప్ (35) అనే మహిళ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కారులో బయలుదేరింది. ఇంతలో ఆమె భుజంపై ఒక సాలీడు పాకుతుండటం గమనించింది. ఒక్కసారిగా ఆమె భయపడిపోయింది. అంతే ఏమాత్రం ఆలోచించకుండా స్టీరింగ్ ను వదిలేసి... కదులుతున్న కారులో నుంచి ఒక్క ఉదుటున బయటకు దూకేసింది. దీంతో షాకైన ఆ తొమ్మిదేళ్ల పిల్లాడు డ్రైవింగ్ సీటులోకి జంప్ చేసి బ్రేక్ పై కాలు వేయకుండా గ్యాస్ పెడల్ పై వేశాడు.
దీంతో కారు అదుపు తప్పి ఓ స్కూలు వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయినా ఆ బాలుడు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ బాలుడిని ఆస్పత్రిలోకి చేర్చించారు. ప్రమాదానికి కారణమైన తల్లిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలా అతి చిన్న విషయాలకే అతిగా స్పందించడాన్ని ఆర్కానో ఫోబియా అంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.