
కంపాలా: హుందాగా ప్రవర్తించాల్సిన చట్ట సభ ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా ఉగాండాకు చెందిన ఎంపీ ఒనెమస్ ట్వినామసికో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల పాలయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘ప్రతీ పురుషుడు భార్యపై పైచేయి సాధించాలి. మహిళలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నపుడు వారిని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదం’టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఉగాండా మహిళలు #OnesmusTwinamasikoMustResign హాష్‌ట్యాగ్‌తో ట్వినామసికో రాజీనామా చేయాలంటూ ట్విటర్ వేదికగా ఉద్యమం చేపట్టారు.
ఉగాండా పార్లమెంట్ స్పీకర్ రెబెకా కడగా, ఆమెతోపాటు పార్లమెంట్‌లోని మహిళా ప్రతినిధులంతా ఎంపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు ఆయన తలొగ్గక తప్పలేదు. మహిళలంటే తనకెంతో గౌరవముందని, మహిళల పట్ల జరుగుతున్న హింసకు తాను వ్యతిరేకమంటూ పార్లమెంట్‌కు లేఖ రాశారు. మహిళలకు క్షమాపణ తెలుపుతూ వివరణ ఇచ్చారు. ఉగాండా అధ్యక్షుడు యొవేరీ ముసేవేని ఆడవారిని హింసించే మగవారంతా పిరికిపందలంటూ సందేశం ఇచ్చినరోజే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అక్కడ ఇవేమీ కొత్తకాదు..
2016లో విడుదల చేసిన ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరు లైంగిక, భౌతిక పరమైన దాడులు ఎదుర్కొంటున్న వారే. 14 నుంచి 49 ఏళ్ల వయసున్న ఆడవారు వివిధ రకాలుగా వేధింపబడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.