నేడు సిడ్నీలో మరో ‘మేడిసన్ స్క్వేర్’
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మోదీ సోమవారం నుంచి సిడ్నీ, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌లలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియాలోకెల్లా అతిపెద్ద ఇండోర్ స్టేడియం అయిన ‘ఆల్ఫోన్స్ అరెనా’లో (సిడ్నీ సూపర్ డోమ్ అని కూడా పిలుస్తారు) ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవలి అమెరికా పర్యటనలో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ‘మేడిసన్ స్క్వేర్’లో 20 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆ తరహాలోనే ప్రవాస భారతీయులను తన ప్రసంగంతో ఉర్రూతలూగించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 16 వేల మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని అంచనా. అలాగే స్టేడియం వెలుపల మరో 5 వేల మంది భారీ తెరల్లో మోదీ ప్రసంగాన్ని వీక్షిస్తారని భావిస్తున్నారు.
మరోవైపు ఈ సభలో పాల్గొనేందుకు 220 మందికిపైగా ఎన్నారైలు ‘మోదీ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసిన ప్రత్యేక రైల్లో ఆదివారం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి బయలుదేరారు. విక్టోరియా మంత్రి మాథ్యూ ఈ రైలును జెండా ఊపి సాగనంపారు.