
ఐదేళ్లలో ఇంటికో డ్రోన్!
వాషింగ్టన్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కనీసం ఎవరో ఒకరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అంతగా అవి మన జీవితంలో భాగమైపోయాయి. ఈ ఫోన్లు నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. అయితే త్వరలో వీటి స్థానాన్ని డ్రోన్లు భర్తీ చేస్తాయట. త్వరలో ఇంటికో డ్రోన్ తప్పనిసరి అవసరంగా మారుతుందని భారత సంతతికి చెందిన నాసా పరిశోధకుడు పరిమల్ కోపడేకర్ అంటున్నాడు.
నాసా ఆధ్వర్యంలో సిలికాన్ వ్యాలీలో ఇటీవల జరిగిన మానవ రహిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఐదు నుంచి పది సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఓ డ్రోన్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మన ఇంటి పైకప్పును పరిశీలించేందుకు, ఏదైనా పని చేసే సమయంలో ఓ చిన్న స్క్రూడ్రైవర్‌ను తీసుకొచ్చేందుకు.. ఇలా అనేక పనులకు ఇళ్లల్లో డ్రోన్‌లను వినియోగిస్తారు. ఈ మార్పు ఐదు నుంచి పదేళ్లలోనే జరుగుతుంది అని పరిమల్ అన్నాడు. ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్న డ్రోన్‌లను శాస్త్రవేత్తలు మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక ఉత్పత్తుల డెలివరీ, నిర్మాణాల తనిఖీ, భద్రత, రక్షణ, వ్యవసాయ పనుల పర్యవేక్షణ తదితర పనులకు కూడా పనికొచ్చేలా డ్రోన్‌లను తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ జామ్‌లలాగా ఆకాశంలో కూడా డ్రోన్‌లతో జామ్‌లు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చని ఆయన తెలిపారు. ఈ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే వ్యవస్థను అభివృద్ది చేసేందుకు గూగుల్, ఆమెజాన్, సిస్కో, రేథియాన్, డ్రోన్ డిప్లాయ్, మ్యాటర్నెట్ తదితర సంస్థలతో నాసా పనిచేస్తోంది.