'సూపర్ రాకెట్' తయారీలో ముందడుగు
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదన సంస్థ నాసా చేపట్టిన 'సూపర్ రాకెట్' తయారీ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది. శక్తివంతమైన రాకెట్ తయారీలో కీలకమైన 'క్రిటికల్ డిజైన్ రివ్యూ' దశను పూర్తి చేసుకున్నట్లు నాసా శుక్రవారం ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాలలో సుదూర ప్రాంతాల పరిశోధన కోసం, అంగారక గ్రహం మీదకు మానవున్ని తీసుకెళ్లడానికి నిర్ధేశించిన ఈ రాకెట్ నిర్మాణం 2018 నాటికి పూర్తి కానుంది. సూపర్ రాకెట్ 'స్పేస్ లాంచ్ సిస్టమ్'ను భూకక్ష్య బయట నాసా చేపట్టే ప్రయోగాలకు వాహకనౌకగా ఉపమోగించనున్నారు.
నాసా డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ హిల్ బిల్ మాట్లాడుతూ.. సూపర్ రాకెట్ ఇంజన్లు, బూస్టర్లు, అన్ని విడిభాగాలు ఇప్పుడు తయారీ దశలో ఉన్నాయన్నారు. రివ్యూ దశ పూర్తి కావడం ఈ ప్రాజెక్టుపై విశ్వాసం పెరిగేలా చేసిందన్నారు. ఈ సూపర్ రాకెట్ 200 అడుగుల పోడవు, 27.6 అడుగుల వ్యాసంతో తయారు కానుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రలకు వాహకనౌకగా ఉపయోగించనున్నఈ సూపర్ రాకెట్లో ఇంధనంగా ద్రవరూప హైడ్రోజన్, ఆక్సీజన్లను ఉపయోగించనున్నారు.