డల్లాస్ 'నాటా' ఉత్సవాలకు సినీతారలు
డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో డల్లాస్ కన్వెన్షన్ 2016 మహా సభలు జరుగనున్నాయి. మే 27 నుంచి మే 29 వరకు మూడు రోజుల పాటు నాటా మహా సభలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు వంటి పలు కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకోనున్నాయి. యూత్ ఫారమ్ కోసం ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేసి సైన్స్ వర్క్‌షాపులు, యూత్ నైట్, ఆర్ట్స్‌అండ్ క్రాఫ్ట్స్ సహా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు నాటా పేర్కొంది. నాటా ఉత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నారు.
రాజకీయ నేతలు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డీకె అరుణ, పీవీ మిథున్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఎ సంపత్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. సినీతారలు హీరో సంపూర్ణేశ్ బాబు, నటి నిత్యా మీనన్, హంస నందిని, శియా గౌతమ్, తేజస్వనీ, మాధూరి ఇటాగీ, తెలుగు దర్శకులు హరీష్ శంకర్, కోదండరామిరెడ్డి, గాంధీ ఈ ఉత్సవాల్లో సందడి చేయనున్నారు. హాస్య నటులు పృధ్వీ బాలిరెడ్డి, సప్తగిరి, ప్రవీన్, బిట్టార్ శెట్టి, బిత్రి సావిత్రి.. తమ హాస్యంతో అందరినీ అలరించనున్నారు.
ఆధ్యాత్మికవేత్తలు ప్రకాశ్ రావు వెలగపూడి, కల్యాణ్ విశ్వనాథన్, స్వామి సర్వేశానంద, స్వామి పరత్మానంద, స్వామి అభిషేక్ చైతన్య గిరి లను ఆహ్వానించనున్నారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. రవీంద్ర సన్నారెడ్డి, సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ రెడ్డి, యూప్ టీవీ సీఈఓ వంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ట్రావెల్, హోటల్ వసతులకు సంబంధించి అన్ని వివరాలు, సంప్రదించాల్సిన నిర్వాహకుల వివరాలను అధికారక వెబ్‌సైట్‌లో పొందపరిచినట్టు నాటా వెల్లడించింది. డల్లాస్ నాటా ఉత్సవాల్లో పాల్గొనాలంటే website: http://nata2016.org/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.