(డాలస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
అంగరంగ వైభవంగా నాటా వేడుకలు
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ నాటా మహాసభలు ఘనంగా ముగిసాయి. డల్లాస్ కన్వెన్షన్ సెంటరులో అశేష జనసందోహం నడుమ కోలాహలంగా విజయవంతంగా ముగిశాయి. ఒక్క ముగింపు రోజైన జూలై2 ఆదివారం నాడే 15వేల పైచిలుకు అతిథులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మూడురోజులకు కలిపి 25వేలకు పైగా అతిథులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటా నాయకుల ఏర్పాట్లకు తగ్గట్టుగానే మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు తమన్ షో ఆహతులను ఆకట్టుకున్నాయి. అలాగే చివరి రోజైన జూలై2 ఆదివారం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ తో నాటా కన్వెన్షన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. వీటికి ధీటుగా వివిధ ఎక్సిబిట్ రూమ్ ల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి.
అధ్యాత్మికం.. భక్తి పారవశ్యం
జులై 2న ఉదయాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణంతో ఆహ్వానితులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. తిరుపతి నుంచి వచ్చిన పండితులు శాస్త్రోక్తంగా శ్రీనివాస కల్యాణం పూర్తి చేశారు. అలాగే 108 మందితో అష్టోత్తరనామార్చన గావించారు. ప్రవాస భక్తులు, నాటా కార్యవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు, APNRTS ఛైర్మన్ వెంకట్, టీటీడీ ఆగమ పండితులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.
నేటి రాజకీయం..
నాటా తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రపై సదస్సు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని మహానేతకు ఘన నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు.
వైఎస్సార్ కు ఘన నివాళులు
కాలేజీ రోజుల్లో తాను చూసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డికి, పాదయాత్ర అనంతరం చూసిన వై.ఎస్‌కు మధ్య చాలా మార్పు వచ్చినట్లు తాను గమనించానని నాటా వ్యవస్థాపకులు డా.ప్రేమ్‌సాగర్ రెడ్డి అన్నారు. పాదయాత్ర తర్వాత వై.ఎస్‌కు ప్రజల పట్ల, వారి కష్టాల పట్ల పెరిగిన అవగాహన కారణంగా మనిషిలో ఆశావాహ దృక్పథం, పేదలకు సాయం చేయాలనే సంకల్పం బలపడిందని అన్నారు. టీటీడీ ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి, డా.వై.ఎస్.ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు రాఘవరెడ్డి గోశాల, ఆళ్ల రామిరెడ్డి, వెంకట్, రత్నాకర్, లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు వై.ఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. నాటా సర్వీస్ అవార్డ్ ని నాటా మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసాల కి నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి చేతులమీదుగా అందించారు. అనంతరం వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ్ ని వేదిక పైకి ఆహ్వానించారు.
ప్రవాసాంధ్రులకు సీఎం జగన్ సందేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ మెసేజ్ ని స్క్రీన్ పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్‌తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. నాటా మహా సభల్లో ప్రదర్శించిన ముఖ్యమంత్రి సందేశం నాటా కన్వెన్షన్‌కి హైలెట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీల ఆలంనై మీట్స్ వివిధ రూమ్స్ లో నిర్వహించారు. ఎస్టేట్ ప్లానింగ్, టాక్స్ ప్లానింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, DRDO ఛైర్మన్ సతీష్ రెడ్డి తో ముఖాముఖీ, స్టార్ట్అప్స్, పొలిటికల్ డిబేట్స్, సదస్సులు సమాంతరంగా సాగాయి.
నవరస భరితం.. సాంస్కృతిక సమ్మేళనం
అలాగే టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో రాముఇజం, తెలుగువారి సొంతమైన అవధానం కూడగలిపిన సాహితీ ప్రక్రియలు, షార్ట్ ఫిలిమ్స్, వివిధ నగరాలలో గెలిచిన నాటా బ్యూటీ పాజెంట్ విజేతలకు ఫైనల్స్ పోటీలు కొనసాగాయి. విజేతలకు మెయిన్ స్టేజ్ పై క్రౌన్ అందించారు. ఆర్ట్స్ ప్రదర్శన, సొగసు చూడతరమా అంటూ మహిళా సదస్సులు జరిగాయి. సాయంత్రం మెయిన్ స్టేజ్ పై సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం 50కే, 100కే మరియు ఆపైన సమర్పించిన స్పాన్సర్స్ ని, నాటా కార్యనిర్వాహక సభ్యులను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను, కన్వెన్షన్ వివిధ కమిటీల ఛైర్స్, కో-ఛైర్స్ లను వేదికమీదకు పిలిచి అభినందించారు. పలు కార్యక్రమాలు వైవిధ్యంగా సందడిగా సాగాయి. పేరడీ, శాస్త్రీయ, సినిమా నృత్య ప్రదర్శనలు, గాన ప్రదర్శనలు, పూర్వ విద్యార్థుల సంఘాల సమావేశాలతో అతిథులు బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్న కార్యక్రమాలకు ప్రధాన వేదికపై స్వర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఆకట్టుకున్న అందం
నాటా బ్యూటీ పాజెంట్ ఫైనల్స్ విజేతలను ప్రకటించగా టీన్, మిస్, మిసెస్ కేటగిరీస్ లో విజేతలకు తెలుగు సినీ నటి తమన్నా క్రౌన్ అందించారు. సుమారు 30 మంది కలిసి చేసిన ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. ఇక సినీ నిర్మాత దిల్ రాజు, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఇండియా నుంచి విచ్చేసిన ఎంపీలు, మంత్రులకు సన్మానం గావించారు. నాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్ సాగర్ రెడ్డి కి ప్రజంట్ చేయడం విశేషం. అలాగే నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కొర్సపాటిని సతీసమేతంగా సన్మానించారు.
(చూడండి: నాటా మహాసభల చిత్రాలు )
అధ్యక్షుడి సందేశం
తనకు, తన బృందానికి నాటా ద్వారా సేవ చేసే అవకాశాన్ని కల్పించి ఈ వేడుకలను విజయవంతం చేసిన వారికి డా.కొర్సపాటి శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాటా కన్వెన్షన్ ని విజయవంతం చేసినందుకు ఆహూతులకు, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు. 2025లో జరగనున్న నాటా మహాసభల గురించి ప్రెసిడెంట్ ఎలక్ట్ హరినాధ రెడ్డి వెల్కూరు తెలిపారు. నాటా తెలుగు మహాసభలు 2025లో జూన్ 27,28,29 తేదిలో న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో నిర్వహించనున్నట్లు వివరించారు. చివరిగా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్ ప్రారంభించారు.దేవి శ్రీ ప్రసాద్ ట్రూప్ క్లాసికల్ పాటతో మొదలుపెట్టి మంచి బీట్ ఉన్న పాటలతో, అలాగే తన డాన్సులతో వేదిక ప్రాంగణాన్ని అదరగొట్టారు. దీంతో నాటా 3 రోజుల కన్వెన్షన్ కి ఘనమైన ముగింపు పలికినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment