మతిమరుపును తగ్గించే ఔషధం గుర్తింపు
న్యూయార్క్: అల్జీమర్స్.. పెద్ద వయసు వారిలో కనిపించే మానసిక వ్యాధి. ఇది సోకిన వారు క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఇప్పటివరకు దీనికి సరైన చికిత్సంటూ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో నయం చేయగలిగే మందులంటూ ఏవీ లేవు. కానీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారు తీసుకునే ఓ మందు అల్జీమర్స్‌ను కూడా అదుపు చేయగలదని పరిశోధకులు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం.. అవయవ మార్పిడి చేయించుకున్న వారు దుష్ర్పభావాలు సోకకుండా ఉండేందుకు తీసుకునే చికిత్స అల్జీమర్స్ నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది.
ఈ చికిత్స తీసుకున్న 2,644 మంది అమెరికా రోగులను పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో ఎనిమిది మందిలో మాత్రమే మతిమరుపు సంబంధమైన లక్షణాలు కనిపించాయి. ఈ సమాచారాన్ని అల్జీమర్స్ అసోసియేషన్ ఫ్యాక్ట్స్, డాటా సమాచారంతో విశ్లేషించారు. దీని ద్వారా అవయవ మార్పిడి వల్ల దుష్ర్పభావాలు సోకకుండా చికిత్స తీసుకున్న వారిలో అల్జీమర్స్ తక్కువగా ఉన్నట్లు, కొందరిలో అసలు ఈ సమస్యే లేనట్లు వారు గుర్తించారు. మతిమరుపు రావడంలో కాల్షిన్యూరిన్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అవయవ మార్పిడి చికిత్సలో తీసుకునే ఔషధాలు ఈ ఎంజైమ్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా వీరికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.