సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కోవిడ్–19 వైరస్ సోకిందా లేదా తెలసుకోవడానికి ఆయాసం, అలసట, గొంతు మంట లక్షణాలే కాకుండా జలుబు, దగ్గు, తల నొప్పి, జ్వరం వచ్చినట్లయితే కోవిడ్ వైరస్ సోకిందని అనుమానించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే రోగుల్లో ఈ లక్షణాలు బయట పడడానికి వైరస్ సోకిన తర్వాత రెండు రోజుల నుంచి 14 రోజుల వరకు పట్టవచ్చు. అప్పటికే పూడ్చలేని నష్టం జరగవచ్చు.
వైరస్ సోకిన కొన్ని గంటల్లో దాన్ని గుర్తించేందుకు బ్రిటన్‌కు చెందిన వైద్యులు రెండు కొత్త లక్షణాలను కనుగొన్నారు. కోవిడ్ వైరస్ సోకిన వారు అన్నింటికన్నా ముందుగా వాసనను గుర్తించలేరని, తర్వాత రుచిని కూడా కోల్పోతారని లండన్‌కు చెందిన ఈఎన్‌టీ వైద్యులు గుర్తించారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న యువత కోవిడ్ బారిన పడినప్పటికీ దాన్ని తెలుసుకునే లోపే పూర్తిగా కోలుకోవచ్చని వారు చెప్పారు. అలాంటి వారిలో ఊపిరితిత్తుల్లోకి చేరకముందే వైరస్ ముక్కులోనే ఆగిపోతుందని, వారి రోగ నిరోధక శక్తి వల్ల అది సాధ్యమవుతుందని వారు చెప్పారు.‘హఠాత్తుగా తమకు వాసనను పసిగట్టే సామర్థ్యం పోయిందంటూ నా క్లినిక్ వచ్చే రోగుల సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరిగిందని, కారణం కనుక్కునేందుకు ప్రయత్నించగా వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు తెల్సిందని బ్రిటన్‌లోని ఈఎన్‌టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ లక్షణాలను నివారించేందుక స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్లను వారం రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment