న్యూఇయర్ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి
సిడ్నీ: కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రపంచ దేశాలు సంబురాలతో హోరెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుండగా.. ఆస్ట్రేలియాలో అప్పుడే నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు కొట్టడంతో సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఆకాశంలో సప్తవర్ణాలు వెల్లివిరుస్తూ.. సంతోష సంబురాలతో ఆస్ట్రేలియా వాసులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సిడ్నీ, అడిలైడ్, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా తదితర నగరాల్లో అత్యంత అట్టహాసంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ సంబరంగా గడిపారు. ఇటు న్యూజీల్యాండ్‌లోనూ కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభయ్యాయి.
మరోవైపు భారత దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు సన్నద్ధమవుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం పార్టీలు, పబ్బులు, సంగీత నాట్యోత్సవాలతో చాలామంది ప్రజలు సిద్ధమవుతున్నారు.