austrealia
-
ఫేస్‌బుక్‌పై విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు..!
అమెరికా వెలుపల నివసిస్తున్న ప్రజల డేటాను మెటా ఉద్దేశపూర్వకంగా ప్రమాదంలో నెట్టివేస్తుందని ఫేస్బుక్ విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌగెన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వెలుపల ఖర్చులను తగ్గించడం కోసం ఫేస్బుక్ యూజర్ల డేటాను ప్రమాదంలో నెడుతున్నట్లు ఫ్రాన్సెస్ హౌగెన్ సోషల్ మీడియా, ఆన్లైన్ భద్రత అంశంపై నేడు ఆస్ట్రేలియా సెలెక్ట్ కమిటీకి చెప్పారు. హానికరమైన కంటెంట్ విషయానికి వస్తే ఫేస్బుక్ "బేర్ మినిమమ్"ను తీసివేస్తుందని హౌగెన్ తెలిపారు. హోం వ్యవహారాల శాఖ కమిటీతో ఇందుకు సంబంధించిన ఫలితాలను పంచుకుంది. సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని ప్రోత్సహించడం, భద్రతా-బై-డిజైన్ విధానాన్ని అవలంబించడం, ఆన్లైన్ వల్ల కలిగే హానిని తగ్గించడం కోసం తగిన సానుకూల చర్యలు తీసుకోవాలని అన్నప్పుడు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా "తరచుగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి చాలా విముఖత చూపుతుంది" అని ఆమె తెలిపింది. విషపూరిత ఆన్లైన్ వార్తలను అరికట్టడానికి ప్రధాన సాంకేతిక సంస్థల విధానాలపై సోషల్ మీడియా విచారణలో భాగంగా హౌగెన్ కమిటీతో ఈ వివరాలను పంచుకున్నారు. ఫేస్బుక్ అల్గోరిథంలు విపరీతమైన కంటెంట్ ప్రోత్సాహిస్తాయని, తద్వారా లాభాలు ఆర్జిస్తుందని హౌగెన్ వివరించింది. విపరీతమైన కంటెంట్ తొలగించడానికి మానిటరింగ్ వ్యవస్థను ఫేస్బుక్ కలిగి ఉన్న సరైన చర్యలు తీసుకోదని ఆమె పేర్కొంది. ఇలాంటి, కంటెంట్ తొలగించడం వల్ల దాని ద్వారా వచ్చే లాభాలను తగ్గించుకోవడం ఇష్టం లేక నామ మాత్రంగా మాత్రమే చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. (చదవండి: కొత్త ఈ-పాస్ పోర్ట్‌లను హ్యాక్ చేస్తే ఇక అంతే సంగతులు..!) -
నాసా అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం!
ప్రపంచంలోని అతిపెద్ద భవనం బుర్జ్ ఖలీఫా కంటే పెద్దదిగా ఉన్న ఒక గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేర్కొంది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీ1గా నామకరణం చేశారు. నాసా పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022న భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. నాసా 1994 పీసీ1 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించింది. దీనిని మొదట ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు నాసా తెలిపింది. దీని వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలం 1 కి.మీ వ్యాసం కలిగి ఉంది. గ్రహాశకలంతో (7482) 1994 పీసీ1 పాటు అనేక ఇతర గ్రహశకలాలు కూడా జనవరి నెలలో భూమిని దాటే అవకాశం ఉంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) భూమికి దగ్గరగా 5 గ్రహశకలాలు వస్తున్నాయని నివేదించింది. ఈ పెద్ద గ్రహశకలాన్ని రేపు టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే, నాసా దీనిని ట్రాక్ చేయడానికి ఒక లింకు కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది. Near-Earth #asteroid 1994 PC1 (~1 km wide) is very well known and has been studied for decades by our #PlanetaryDefense experts. Rest assured, 1994 PC1 will safely fly past our planet 1.2 million miles away next Tues., Jan. 18. Track it yourself here: https://t.co/JMAPWiirZh pic.twitter.com/35pgUb1anq — NASA Asteroid Watch (@AsteroidWatch) January 12, 2022 (చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!) -
లాక్ డౌన్ ఆంక్షలకు వ్యతిరేఖంగా ఆస్ట్రేలియాలో ఆందోళనలు
-
61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు
సిడ్నీ: అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా అలీసా హీలీ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో బుధవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో అలీసా హీలీ కేవలం 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆ్రస్టేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలు అయిన అలీసా బ్యాటింగ్ మెరుపుల కారణంగా ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 132 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు సాధించింది. అలీసా 25 బంతుల్లో అర్ధ సెంచరీ... 46 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. అలీసా హీలీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మెగ్‌లానింగ్ (ఆ్రస్టేలియా–133 నాటౌట్) పేరిట ఉండేది. -
ఎవరు గెలిచినా చరిత్రే
తొలి రౌండ్ నుంచి ఊహకందని రీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం మ్యాచ్‌లకు నేడు అద్భుతమైన ముగింపు లభించనుంది. టైటిల్ ఫేవరెట్స్ అనుకున్న వారు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిముఖం పట్టడం... బరిలో ఉన్న మాజీ విజేతలు కూడా బోల్తా పడటంతో... ఈసారి మట్టికోర్టులపై కొత్త మహరాణి అవతరించనుంది. అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ...చెక్ రిపబ్లిక్ టీనేజర్ మర్కెటా వొండ్రుసోవా నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న జొహనా కొంటా (బ్రిటన్), అమండ అనిసిమోవా (అమెరికా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. పారిస్: తమ కెరీర్లో ఏనాడూ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)లలో ఒకరు నేడు తొలిసారి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించనున్నారు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ ఇద్దరు మహిళల సింగిల్స్ కిరీటం కోసం శనివారం పోరాడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, 23 ఏళ్ల యాష్లే బార్టీ 6–7 (4/7), 6–3, 6–3తో 17 ఏళ్ల అమెరికా టీనేజర్ అమండ అనిసిమోవాపై... అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా 7–5, 7–6 (7/2)తో 26వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించారు. ఇప్పటివరకు 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన బార్టీకి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. మరోవైపు ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన వొండ్రుసోవా గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి తమ కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు తొలిసారి ‘గ్రాండ్’ టైటిల్ కోసం పోటీపడనున్నారు. తడబడి... తేరుకుని క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)ను వరుస సెట్లలో ఓడించిన అనిసిమోవా సెమీస్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆరంభంలో యాష్లే బార్టీ ఒక్కసారిగా విజృంభించి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు... 40–15 పాయింట్లతో సెట్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే అనిసిమోవా అనూహ్య పోరాటపటిమ కనబరిచింది. సెట్ పాయింట్ కాపాడుకోవడమే కాకుండా వరుస గేమ్‌లు గెలిచి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. 12వ గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బార్టీ బ్రేక్ చేసి స్కోరును 6–6తో సమం చేసింది.టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. అదే ఉత్సాహంతో అనిసిమోవా రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయందిశగా సాగిపోయింది. కానీ బార్టీ పట్టువదలకుండా పోరాడింది. రెండో సెట్లో వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌ను 6–3తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో యాష్లే బార్టీ సంయమనంతో ఆడి ఆరో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఓవరాల్‌గా ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించింది. అదే జోరు... సెట్ కోల్పోకుండా సెమీస్ చేరిన వొండ్రుసోవా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కీలకదశలో నిగ్రహంతో ఆడి ఫలితాన్ని సాధించింది. తొలి సెట్లో ఒకదశలో వొండ్రుసోవా 3–5తో వెనుకబడి తన సర్వీస్‌లో మూడు సెట్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత తేరుకొని సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో, 12వ గేమ్‌లో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 7–5తో కైవసం చేసుకుంది. రెండో సెట్లోనూ ఆరంభంలో కొంటా ఆధిపత్యం చలాయించింది. 3–1తో, 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీలకదశలో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వొండ్రుసోవా స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో వొండ్రుసోవా పైచేయి సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
దీటుగా... ధాటిగా..!
ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు... పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన ఆరంభం ఇది. ప్రత్యర్థి బౌలింగ్ పదును చూస్తుంటే ఇన్నింగ్స్ కుప్పకూలుతుందేమో అనిపించింది. అయితే తన స్థాయికి తగిన ఆటతో కెప్టెన్ విరాట్ కోహ్లి, కౌంటర్ అటాక్‌తో వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత్‌ను కాపాడారు. పట్టు చిక్కిందనుకున్న ఆస్ట్రేలియాను సమర్థంగా అడ్డుకొని రెండో రోజును సంతృప్తిగా ముగించారు. ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉండటంతో పూర్తిగా సురక్షిత స్థితికి వచ్చిందని చెప్పలేం కానీ ఇప్పటి వరకు జరిగిన ఆటను బట్టి చూస్తే భారీ ఆధిక్యం కోల్పోయే ప్రమాదం మాత్రం తక్కువగా ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కీలకంగా మారిన నేపథ్యంలో... 2014 మెల్బోర్న్ టెస్టు భాగస్వామ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన కోహ్లి, రహానే జోడి మూడో రోజు ఎంత సేపు నిలబడుతుందనే దానిపైనే భారత్ ఆశలు నిలిచాయి. పెర్త్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (181 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), అజింక్య రహానే (103 బంతుల్లో 51 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 90 పరుగులు జోడించారు. మూడో వికెట్‌కు కూడా పుజారా (103 బంతుల్లో 24; 1 ఫోర్)తో కలిసి కోహ్లి కీలక 74 పరుగులు జత చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 277/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (89 బంతుల్లో 38; 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు 4 వికెట్లు దక్కగా... బుమ్రా, విహారి, ఉమేశ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. 49 పరుగులు జోడించి... రెండో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరో 18.3 ఓవర్ల పాటు సాగింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ పైన్, కమిన్స్ (19) భాగస్వామ్యం ఆసీస్‌ను ముందుకు నడిపించింది. వీరిద్దరు కలిసి స్కోరును 300 పరుగులు దాటించారు. ఏడో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్‌ను బౌల్డ్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు బంతులకే బుమ్రా బౌలింగ్‌లో పైన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వరుస బంతుల్లో స్టార్క్ (6), హాజల్‌వుడ్ (0)లను ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు ఇషాంత్ తెర దించాడు. కోహ్లి, పుజారా జాగ్రత్తగా... భారత ఓపెనర్లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లండ్‌లో రెండో టెస్టులో రెండు డకౌట్లతో చోటు కోల్పోయి అడిలైడ్‌లో పునరాగమనం చేసిన మురళీ విజయ్ మరో ‘డక్’ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్క్ వేసిన చక్కటి బంతికి విజయ్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. లంచ్ విరామం తర్వాత హాజల్‌వుడ్ యార్కర్ రాహుల్ (2) వికెట్లను గిరాటేసింది. ఈ దశలో కోహ్లి, పుజారా చాలా జాగ్రత్త పడ్డారు. పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ఆరంభంలో హాజల్‌వుడ్ ఓవర్లో కోహ్లి మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని సంయమనం ప్రదర్శించగా, పుజారా కూడా తనదైన శైలిలో అండగా నిలిచాడు. ముఖ్యంగా కమిన్స్, లయన్ జోడి భారత్ బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టి పడేయడంతో పరుగులు రావడమే గగనంగా మారింది. ఈ జోడి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఏకంగా 135 బంతులు తీసుకుంది. టీ విరామం తర్వాత 23 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ కోసం ఆస్ట్రేలియా రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. అయితే మరో పరుగు మాత్రమే జోడించిన పుజారాను స్టార్క్ వెనక్కి పంపడంతో కంగారూలు ఊపిరి పీల్చుకున్నారు. రహానే దూకుడు... కీలకమైన పుజారాను ఔట్ చేశామన్న ఆసీస్ ఆనందంపై రహానే నీళ్లు చల్లాడు. వచ్చీ రాగానే ధాటిని ప్రదర్శించిన అతను చకచకా బౌండరీలతో దూసుకుపోయాడు. స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్‌కట్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు 109 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి కూడా జోరు పెంచాడు. చివరి గంటలో వీరిద్దరు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో రెండు అద్భుతమైన షాట్లతో ఫోర్లు కొట్టిన రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 8/2 స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను కాపాడాల్సిన బాధ్యత కోహ్లి, పుజారాలపై పడింది. ఒకవైపు పేసర్ కమిన్స్ కచ్చితత్వంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే... మరో ఎండ్‌లో లయన్ టర్న్, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను కదలనీయలేదు. ఫలితంగా భారత్ పరుగు పరుగుకూ శ్రమించింది. కమిన్స్, లయన్ కలిపి వరుసగా వేసిన పది ఓవర్లలో (13 నుంచి 22 ఓవర్ల వరకు) టీమిండియా 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాట్‌కు అతి సమీపంగా వెళ్లి కీపర్ చేతుల్లో పడిన బంతులు... ఫీల్డర్లకు కాస్త ముందుగా పడి అదృష్టవశాత్తూ క్యాచ్ కాకుండా ఉండి పోయిన షాట్లు... స్టంప్స్‌ను దాదాపు తాకుతూ వెళ్లిన బంతి... ఇలా అనేక ఉత్కంఠభరిత క్షణాలను భారత బ్యాట్స్‌మెన్ అధిగమించారు. అయితే వికెట్ మాత్రం చేజార్చుకోకపోవడం విశేషం. కోహ్లిలాంటి ఆటగాడు క్రీజ్‌లో ఉన్నప్పటికీ 22 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. 10వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత 32వ ఓవర్లో గానీ కోహ్లి ఫోర్ బాదలేదు. రెండో సెషన్లో 29 ఓవర్లు ఆడిన భారత్ 64 పరుగులు మాత్రమే చేసింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) రహానే (బి) విహారి 70; ఫించ్ (ఎల్బీ) (బి) బుమ్రా 50; ఖాజా (సి) పంత్ (బి) ఉమేశ్ 5; షాన్ మార్‡్ష (సి) రహానే (బి) విహారి 45; హ్యాండ్స్కోంబ్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 7; హెడ్ (సి) షమీ (బి) ఇషాంత్ 58; పైన్ (ఎల్బీ) (బి) బుమ్రా 38; కమిన్స్ (బి) ఉమేశ్ 19; స్టార్క్ (సి) పంత్ (బి) ఇషాంత్ 6; లయన్ (నాటౌట్) 9; హాజల్‌వుడ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (108.3 ఓవర్లలో ఆలౌట్) 326. వికెట్ల పతనం: 1–112; 2–130; 3–134; 4–148; 5–232; 6–251; 7–310; 8–310; 9–326; 10–326. బౌలింగ్: ఇషాంత్ 20.3–7–41–4; బుమ్రా 26–8–53–2; ఉమేశ్ 23–3–78–2; షమీ 24–3–80–0; విహారి 14–1–53–2; విజయ్ 1–0–10–0. భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) హాజల్‌వుడ్ 2; విజయ్ (బి) స్టార్క్ 0; పుజారా (సి) పైన్ (బి) స్టార్క్ 24; కోహ్లి (బ్యాటింగ్) 82; రహానే (బ్యాటింగ్) 51; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (69 ఓవర్లలో 3 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–6; 2–8; 3–82. బౌలింగ్: స్టార్క్ 14–4–42–2; హాజల్‌వుడ్ 16–7–50–1; కమిన్స్ 17–3–40–0; లయన్ 22–4–34–0. -
అగ్రస్థానం ఎవరిదో!
ప్రొవిడెన్స్ (గయానా): ఎనిమిదేళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన భారత మహిళల జట్టు మరో ఆసక్తికర పోరుకు సన్నద్ధమైంది. గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ గ్రూప్ నుంచి ఇరు జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టును ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిస్తే భారత జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. అయితే తమ మూడు లీగ్ మ్యాచ్‌లలో కూడా అలవోక విజయాలు సాధించిన ఆసీస్ అమితోత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. సూపర్ ఫామ్‌లో మిథాలీ... టోర్నీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో కివీస్‌పై భారత్‌కు విజయం దక్కింది. ఆ తర్వాత పాక్‌పై, ఐర్లాండ్‌పై వరుసగా రెండు అర్ధ సెంచరీలతో మిథాలీ రాజ్ జట్టును గెలిపించింది. స్మృతి మంధాన గత మ్యాచ్‌లో రాణించడంతో ముగ్గురు సీనియర్ క్రికెటర్లు కూడా ఫామ్‌లో ఉన్నట్లయింది. వీరిలో కనీసం ఇద్దరు బాగా ఆడినా జట్టుకు మంచి విజయావకాశాలుంటాయి. జెమీమా రోడ్రిగ్స్ కూడా ఆకట్టుకోవడం జట్టుకు అదనపు బలం. మిడిలార్డర్లో వేద కృష్ణమూర్తికి తొలి రెండు మ్యాచ్‌లలో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. ఆమె కూడా చెలరేగితే భారత్ భారీ స్కోరును ఆశించవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కూడా భారత స్పిన్నర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీస్తోంది. కేవలం 12 స్ట్రయిక్ రేట్‌తో ఆమె 6 వికెట్లు తీసింది. ఐదేసి వికెట్లు తీసిన రాధా యాదవ్, హేమలత కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు మ్యాచ్‌లలో ఒక్కో పేసర్‌నే భారత్ ఆడించింది. తొలి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఆడగా, ఐర్లాండ్‌పై మాన్సి జోషి పొదుపైన బౌలింగ్ చేసింది. మళ్లీ సమష్టి ప్రదర్శన కనబరిస్తే కంగారూ జట్టును కూడా టీమిండియా కంగారు పెట్టించడం ఖాయం. జోరు మీదున్న హీలీ... మరోవైపు ఆస్ట్రేలియా కూడా అలవోక విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌పై 52 పరుగులతో ఘన విజయం సాధించిన ఆ జట్టు... ఆ తర్వాత ఐర్లాండ్‌ను 9 వికెట్లతో, న్యూజిలాండ్‌ను 33 పరుగులతో చిత్తు చేసింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ అలీసా హీలీ ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తోంది. 160.20 స్ట్రయిక్ రేట్‌తో ఆమె ఈ టోర్నీలో 157 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు సునాయాస అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ విజయాల్లో మూనీ, కెప్టెన్ లానింగ్‌లు హీలీకి సహకరించారు. జట్టును గెలిపించడంలో స్ట్రయిక్ పేస్ బౌలర్ మెగాన్ షుట్ది కూడా కీలక పాత్ర. మూడు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు తీసిన షుట్ ఓవర్లో ఐదు పరుగులకు మించి ఇవ్వలేదు. షుట్ కాకుండా ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరో ఐదుగురు బౌలర్లను ఉపయోగించగా వారంతా తలా మూడు వికెట్లతో సత్తా చాటడం విశేషం. కెరీర్లో 100వ టి20 మ్యాచ్ ఆడబోతున్న సీనియర్ పేసర్ ఎలైస్ పెర్రీ కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టగలదు. ఇరు జట్లు దూకుడుగా ఆడుతుండటంతో ఈ చివరి లీగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోహిత్ శర్మను దాటిన మిథాలీ... అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. పురుషులు, మహిళల టి20లను కలిపి చూస్తే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనతకెక్కింది. రోహిత్ శర్మ (87 మ్యాచ్‌లలో 2207 పరుగులు)ను అధిగమించి మిథాలీ (85 మ్యాచ్‌లలో 2283) అగ్రస్థానానికి చేరుకుంది. రోహిత్ సగటు 33.43 కాగా, మిథాలీ 37.42 సగటుతో కొనసాగుతోంది. 4 సెంచరీలతో పాటు రోహిత్ మరో 15 అర్ధ సెంచరీలు చేయగా... 97 అత్యధిక స్కోరు కలిగిన మిథాలీ కెరీర్లో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లి (2102), హర్మన్‌ప్రీత్ కౌర్ (1,827) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. రాత్రి గం.8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నైజీరియన్ తో సహజీవనం, విదేశీ మహిళ మృతి
నైజీరియా యువకుడితో సహజీవనం చేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నైజీరియాకు చెందిన అల్బర్టో కోరర్ (38) అక్బర్పురాలో ఉంటూ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కానగా, టూరిస్ట్ వీసాపై భారతదేశం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన మార్గెరేట్ లిండా (53)కు ఏడాదిన్నర క్రితం అల్బర్టోతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్బర్ పురాలో ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. లిండా ఆస్తమా వ్యాధిగ్రస్తురాలు. కొంతకాలంగా ఆమె ఆస్తమాతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గురువారం తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే లిండా మృతి చెందింది. భవన యజమాని, నైజీరియన్ విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిండా అస్తమా డోస్ ఎక్కువగా తీసుకుందని అల్బర్టో పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అస్తమాకు తీసుకున్న డోస్ ఎక్కువైందా...? లేక లిండాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా...? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. -
న్యూఇయర్ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి
సిడ్నీ: కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రపంచ దేశాలు సంబురాలతో హోరెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుండగా.. ఆస్ట్రేలియాలో అప్పుడే నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు కొట్టడంతో సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఆకాశంలో సప్తవర్ణాలు వెల్లివిరుస్తూ.. సంతోష సంబురాలతో ఆస్ట్రేలియా వాసులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సిడ్నీ, అడిలైడ్, మెల్బోర్న్, కాన్బెర్రా తదితర నగరాల్లో అత్యంత అట్టహాసంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటూ సంబరంగా గడిపారు. ఇటు న్యూజీల్యాండ్‌లోనూ కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభయ్యాయి. మరోవైపు భారత దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించేందుకు సన్నద్ధమవుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం పార్టీలు, పబ్బులు, సంగీత నాట్యోత్సవాలతో చాలామంది ప్రజలు సిద్ధమవుతున్నారు.