ప్రొవిడెన్స్ (గయానా): ఎనిమిదేళ్ల తర్వాత టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన భారత మహిళల జట్టు మరో ఆసక్తికర పోరుకు సన్నద్ధమైంది. గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ గ్రూప్ నుంచి ఇరు జట్లు మూడేసి విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టును ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిస్తే భారత జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. అయితే తమ మూడు లీగ్ మ్యాచ్‌లలో కూడా అలవోక విజయాలు సాధించిన ఆసీస్ అమితోత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది.
సూపర్ ఫామ్‌లో మిథాలీ...
టోర్నీ తొలి మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో కివీస్‌పై భారత్‌కు విజయం దక్కింది. ఆ తర్వాత పాక్‌పై, ఐర్లాండ్‌పై వరుసగా రెండు అర్ధ సెంచరీలతో మిథాలీ రాజ్ జట్టును గెలిపించింది. స్మృతి మంధాన గత మ్యాచ్‌లో రాణించడంతో ముగ్గురు సీనియర్ క్రికెటర్లు కూడా ఫామ్‌లో ఉన్నట్లయింది. వీరిలో కనీసం ఇద్దరు బాగా ఆడినా జట్టుకు మంచి విజయావకాశాలుంటాయి. జెమీమా రోడ్రిగ్స్ కూడా ఆకట్టుకోవడం జట్టుకు అదనపు బలం. మిడిలార్డర్‌లో వేద కృష్ణమూర్తికి తొలి రెండు మ్యాచ్‌లలో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. ఆమె కూడా చెలరేగితే భారత్ భారీ స్కోరును ఆశించవచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కూడా భారత స్పిన్నర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు.
ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీస్తోంది. కేవలం 12 స్ట్రయిక్ రేట్‌తో ఆమె 6 వికెట్లు తీసింది. ఐదేసి వికెట్లు తీసిన రాధా యాదవ్, హేమలత కూడా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మూడు మ్యాచ్‌లలో ఒక్కో పేసర్‌నే భారత్ ఆడించింది. తొలి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఆడగా, ఐర్లాండ్‌పై మాన్సి జోషి పొదుపైన బౌలింగ్ చేసింది. మళ్లీ సమష్టి ప్రదర్శన కనబరిస్తే కంగారూ జట్టును కూడా టీమిండియా కంగారు పెట్టించడం ఖాయం.
జోరు మీదున్న హీలీ...
మరోవైపు ఆస్ట్రేలియా కూడా అలవోక విజయాలతో సెమీఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌పై 52 పరుగులతో ఘన విజయం సాధించిన ఆ జట్టు... ఆ తర్వాత ఐర్లాండ్‌ను 9 వికెట్లతో, న్యూజిలాండ్‌ను 33 పరుగులతో చిత్తు చేసింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ అలీసా హీలీ ఒంటి చేత్తో జట్టును గెలిపిస్తోంది. 160.20 స్ట్రయిక్ రేట్‌తో ఆమె ఈ టోర్నీలో 157 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు సునాయాస అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ విజయాల్లో మూనీ, కెప్టెన్ లానింగ్‌లు హీలీకి సహకరించారు.
జట్టును గెలిపించడంలో స్ట్రయిక్ పేస్ బౌలర్ మెగాన్ షుట్‌ది కూడా కీలక పాత్ర. మూడు మ్యాచ్‌లలో కలిపి 6 వికెట్లు తీసిన షుట్ ఓవర్లో ఐదు పరుగులకు మించి ఇవ్వలేదు. షుట్ కాకుండా ఈ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరో ఐదుగురు బౌలర్లను ఉపయోగించగా వారంతా తలా మూడు వికెట్లతో సత్తా చాటడం విశేషం. కెరీర్‌లో 100వ టి20 మ్యాచ్ ఆడబోతున్న సీనియర్ పేసర్ ఎలైస్ పెర్రీ కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టగలదు. ఇరు జట్లు దూకుడుగా ఆడుతుండటంతో ఈ చివరి లీగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రోహిత్ శర్మను దాటిన మిథాలీ...
అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. పురుషులు, మహిళల టి20లను కలిపి చూస్తే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనతకెక్కింది. రోహిత్ శర్మ (87 మ్యాచ్‌లలో 2207 పరుగులు)ను అధిగమించి మిథాలీ (85 మ్యాచ్‌లలో 2283) అగ్రస్థానానికి చేరుకుంది. రోహిత్ సగటు 33.43 కాగా, మిథాలీ 37.42 సగటుతో కొనసాగుతోంది. 4 సెంచరీలతో పాటు రోహిత్ మరో 15 అర్ధ సెంచరీలు చేయగా... 97 అత్యధిక స్కోరు కలిగిన మిథాలీ కెరీర్‌లో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లి (2102), హర్మన్‌ప్రీత్ కౌర్ (1,827) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
రాత్రి గం.8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment