నైజీరియన్ తో సహజీవనం, విదేశీ మహిళ మృతి
నైజీరియా యువకుడితో సహజీవనం చేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నైజీరియాకు చెందిన అల్బర్టో కోరర్ (38) అక్బర్పురాలో ఉంటూ యూసఫ్గూడలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కానగా, టూరిస్ట్ వీసాపై భారతదేశం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన మార్గెరేట్ లిండా (53)కు ఏడాదిన్నర క్రితం అల్బర్టోతో పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ అక్బర్ పురాలో ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. లిండా ఆస్తమా వ్యాధిగ్రస్తురాలు. కొంతకాలంగా ఆమె ఆస్తమాతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గురువారం తాను ఉంటున్న ఫ్లాట్లోనే లిండా మృతి చెందింది. భవన యజమాని, నైజీరియన్ విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిండా అస్తమా డోస్ ఎక్కువగా తీసుకుందని అల్బర్టో పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అస్తమాకు తీసుకున్న డోస్ ఎక్కువైందా...? లేక లిండాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా...? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.