తొలి రౌండ్ నుంచి ఊహకందని రీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం మ్యాచ్‌లకు నేడు అద్భుతమైన ముగింపు లభించనుంది. టైటిల్ ఫేవరెట్స్ అనుకున్న వారు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిముఖం పట్టడం... బరిలో ఉన్న మాజీ విజేతలు కూడా బోల్తా పడటంతో... ఈసారి మట్టికోర్టులపై కొత్త మహరాణి అవతరించనుంది.
అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ...చెక్ రిపబ్లిక్ టీనేజర్ మర్కెటా వొండ్రుసోవా నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న జొహనా కొంటా (బ్రిటన్), అమండ అనిసిమోవా (అమెరికా) పోరాటం సెమీఫైనల్లో
ముగిసింది.
పారిస్: తమ కెరీర్‌లో ఏనాడూ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)లలో ఒకరు నేడు తొలిసారి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించనున్నారు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ ఇద్దరు మహిళల సింగిల్స్ కిరీటం కోసం శనివారం పోరాడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, 23 ఏళ్ల యాష్లే బార్టీ 6–7 (4/7), 6–3, 6–3తో 17 ఏళ్ల అమెరికా టీనేజర్ అమండ అనిసిమోవాపై... అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా 7–5, 7–6 (7/2)తో 26వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించారు.
ఇప్పటివరకు 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన బార్టీకి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. మరోవైపు ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన వొండ్రుసోవా గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి తమ కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు తొలిసారి ‘గ్రాండ్’ టైటిల్ కోసం పోటీపడనున్నారు.
తడబడి... తేరుకుని
క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)ను వరుస సెట్‌లలో ఓడించిన అనిసిమోవా సెమీస్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆరంభంలో యాష్లే బార్టీ ఒక్కసారిగా విజృంభించి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు... 40–15 పాయింట్లతో సెట్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే అనిసిమోవా అనూహ్య పోరాటపటిమ కనబరిచింది. సెట్ పాయింట్ కాపాడుకోవడమే కాకుండా వరుస గేమ్‌లు గెలిచి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. 12వ గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బార్టీ బ్రేక్ చేసి స్కోరును 6–6తో సమం చేసింది.టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది.
అదే ఉత్సాహంతో అనిసిమోవా రెండో సెట్‌లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయందిశగా సాగిపోయింది. కానీ బార్టీ పట్టువదలకుండా పోరాడింది. రెండో సెట్‌లో వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌ను 6–3తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో యాష్లే బార్టీ సంయమనంతో ఆడి ఆరో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఓవరాల్‌గా ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించింది.
అదే జోరు...
సెట్ కోల్పోకుండా సెమీస్ చేరిన వొండ్రుసోవా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కీలకదశలో నిగ్రహంతో ఆడి ఫలితాన్ని సాధించింది. తొలి సెట్‌లో ఒకదశలో వొండ్రుసోవా 3–5తో వెనుకబడి తన సర్వీస్‌లో మూడు సెట్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత తేరుకొని సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో, 12వ గేమ్‌లో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 7–5తో కైవసం చేసుకుంది.
రెండో సెట్‌లోనూ ఆరంభంలో కొంటా ఆధిపత్యం చలాయించింది. 3–1తో, 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీలకదశలో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వొండ్రుసోవా స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో వొండ్రుసోవా పైచేయి సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment