French Open womens singles
-
భళా...బార్టీ
పారిస్: ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బార్టీ 6–1, 6–3తో అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై ఘనవిజయం సాధించింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ వొండ్రుసోవా నుంచి 23 ఏళ్ల బార్టీకి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని 19 ఏళ్ల వొండ్రుసోవా కీలక పోరులో నాలుగు గేమ్‌లు మాత్రమే గెల్చుకోగలిగింది. ఈ విజయంతో యాష్లే బార్టీ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1973లో మార్గరెట్ కోర్ట్ ఈ వేదికపై ఆస్ట్రేలియాకు సింగిల్స్ టైటిల్‌ను అందించింది. తాజా గెలుపుతో బార్టీ సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. 2011లో సమంత స్టోసుర్ (యూఎస్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆసీస్ ప్లేయర్‌గా బార్టీ నిలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. నాకైతే మాటలు రావడంలేదు. ఫైనల్లో అత్యుత్తమ ఆటతీరు కనబరిచాను. నా ఆటపట్ల నాకెంతో గర్వంగా ఉంది. గత రెండు వారాలు అద్భుతంగా గడిచాయి’ అని బార్టీ వ్యాఖ్యానిం చింది. విజేత బార్టీకి ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ వొండ్రుసోవాకు 11 లక్షల 80 వేల యూరోలు (రూ.9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్‌తో థీమ్ ‘ఢీ’ నేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తలపడనున్నాడు. రెండో సెమీఫైనల్లో థీమ్ 6–2, 3–6, 7–5, 5–7, 7–5తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. గతేడాది కూడా నాదల్, థీమ్ మధ్యే ఫైనల్ జరగ్గా... నాదల్‌ను విజయం వరించింది. నేటి ఫైనల్లో నాదల్ గెలిస్తే రికార్డుస్థాయిలో 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. థీమ్ గెలిస్తే ఈ టోర్నీ ఫైనల్లో నాదల్‌ను ఓడించిన తొలి క్రీడాకారిడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాకుండా 1995లో థామస్ ముస్టర్ (ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన ఆస్ట్రియా ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు. యాష్లే బార్టీ -
ఎవరు గెలిచినా చరిత్రే
తొలి రౌండ్ నుంచి ఊహకందని రీతిలో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం మ్యాచ్‌లకు నేడు అద్భుతమైన ముగింపు లభించనుంది. టైటిల్ ఫేవరెట్స్ అనుకున్న వారు క్వార్టర్ ఫైనల్లోపే ఇంటిముఖం పట్టడం... బరిలో ఉన్న మాజీ విజేతలు కూడా బోల్తా పడటంతో... ఈసారి మట్టికోర్టులపై కొత్త మహరాణి అవతరించనుంది. అంచనాలకు మించి రాణించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లే బార్టీ...చెక్ రిపబ్లిక్ టీనేజర్ మర్కెటా వొండ్రుసోవా నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న జొహనా కొంటా (బ్రిటన్), అమండ అనిసిమోవా (అమెరికా) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. పారిస్: తమ కెరీర్లో ఏనాడూ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)లలో ఒకరు నేడు తొలిసారి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించనున్నారు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ ఇద్దరు మహిళల సింగిల్స్ కిరీటం కోసం శనివారం పోరాడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్, 23 ఏళ్ల యాష్లే బార్టీ 6–7 (4/7), 6–3, 6–3తో 17 ఏళ్ల అమెరికా టీనేజర్ అమండ అనిసిమోవాపై... అన్‌సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా 7–5, 7–6 (7/2)తో 26వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై విజయం సాధించారు. ఇప్పటివరకు 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన బార్టీకి ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకోవడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. మరోవైపు ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన వొండ్రుసోవా గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి తమ కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు తొలిసారి ‘గ్రాండ్’ టైటిల్ కోసం పోటీపడనున్నారు. తడబడి... తేరుకుని క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా)ను వరుస సెట్లలో ఓడించిన అనిసిమోవా సెమీస్‌లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆరంభంలో యాష్లే బార్టీ ఒక్కసారిగా విజృంభించి 5–0తో ఆధిక్యంలోకి వెళ్లడంతోపాటు... 40–15 పాయింట్లతో సెట్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే అనిసిమోవా అనూహ్య పోరాటపటిమ కనబరిచింది. సెట్ పాయింట్ కాపాడుకోవడమే కాకుండా వరుస గేమ్‌లు గెలిచి 6–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. 12వ గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బార్టీ బ్రేక్ చేసి స్కోరును 6–6తో సమం చేసింది.టైబ్రేక్‌లో అనిసిమోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. అదే ఉత్సాహంతో అనిసిమోవా రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లి విజయందిశగా సాగిపోయింది. కానీ బార్టీ పట్టువదలకుండా పోరాడింది. రెండో సెట్లో వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌ను 6–3తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో యాష్లే బార్టీ సంయమనంతో ఆడి ఆరో గేమ్‌లో అనిసిమోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బార్టీ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఓవరాల్‌గా ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించింది. అదే జోరు... సెట్ కోల్పోకుండా సెమీస్ చేరిన వొండ్రుసోవా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కీలకదశలో నిగ్రహంతో ఆడి ఫలితాన్ని సాధించింది. తొలి సెట్లో ఒకదశలో వొండ్రుసోవా 3–5తో వెనుకబడి తన సర్వీస్‌లో మూడు సెట్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత తేరుకొని సర్వీస్‌ను కాపాడుకొని పదో గేమ్‌లో, 12వ గేమ్‌లో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 7–5తో కైవసం చేసుకుంది. రెండో సెట్లోనూ ఆరంభంలో కొంటా ఆధిపత్యం చలాయించింది. 3–1తో, 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీలకదశలో కొంటా సర్వీస్‌ను బ్రేక్ చేసిన వొండ్రుసోవా స్కోరును 5–5తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో వొండ్రుసోవా పైచేయి సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొండ్రుసోవా నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
అనిసిమోవా సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్–2007 ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 1990లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్ విలియమ్స్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహనా కొంటా (బ్రిటన్) తలపడతారు. సెమీస్‌లో జొకోవిచ్, థీమ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); జొకోవిచ్‌తో థీమ్ ఆడతారు. -
సెరెనాపై ముగురుజా సంచలన విజయం
-
మట్టి కోటలో కొత్త రాణి
► ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా ► ఫైనల్లో సెరెనాపై సంచలన విజయం ► రూ. 15 కోట్ల 18 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ‘ఈ ఓటమి గురించి బాధపడకు. ఏనాటికైనా నీవు గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తావు’... గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ముగురుజాపై నెగ్గిన తర్వాత సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి ఆటతీరుపై చేసిన వ్యాఖ్య ఇది. ఏడాది కాకుండానే సెరెనా అంచనా నిజమైంది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. ఎర్ర మట్టి కోర్టులపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ స్పెయిన్ అమ్మాయి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన ముగురుజా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మరోవైపు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేయాలని ఆశించిన సెరెనాకు నిరాశే మిగిలింది. పారిస్: గత తొమ్మిదేళ్లుగా వస్తోన్న ఆనవాయితీ ఈసారీ కొనసాగింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంలో మళ్లీ విఫలమైంది. అంచనాలకు మించి రాణించిన స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా... అద్వితీయ ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ ముగురుజా 7-5, 6-4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ముగురుజా తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్లే కోర్టులపై ఆడిన తొలి ఫైనల్లోనే ట్రోఫీని దక్కించుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ముగురుజా గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ఈ అమెరికా స్టార్ చేతిలో ఓడిపోయింది. అయితే వింబుల్డన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ముగురుజా ఈసారి పక్కా ప్రణాళికతో ఆడి సెరెనాకు ఓటమి రుచి చూపించింది. ► నాలుగు ఏస్‌లు సంధించి, తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసిన ముగురుజా కీలకదశల్లో సెరెనా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయడం తుది ఫలితంపై ప్రభావం చూపింది. ముగురుజా కంటే ఎక్కువ విన్నర్స్ కొట్టినా... తక్కువ అనవసర తప్పిదాలు చేసినా... సెరెనా తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ► తొలి సెట్ ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 4-4తో సమం చేసింది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌నూ కాపాడుకోవడంతో సెట్‌ను దక్కించుకుంది. ► రెండో సెట్లోనూ ముగురుజా నిలకడగా ఆడింది. సెరెనాపై ఒత్తిడిని కొనసాగించింది. దాంతో ఈ సెట్లోనూ సెరెనా రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఈ అమెరికా స్టార్ తేరుకోలేకపోయింది. ► 1998లో అరంటా శాంచెజ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. ► తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ముగురుజా రెండో స్థానానికి ఎగబాకుతుంది. 2000లో అరంటా శాంచెజ్ తర్వాత మరోసారి ఓ స్పెయిన్ క్రీడాకారిణి రెండో ర్యాంక్‌ను అందుకోవడం ఇదే ప్రథమం. ► చివరి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ముగ్గురు కొత్త విజేతలు రావడం విశేషం. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగురుజా టైటిల్స్ సాధించారు. ► గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో సెరెనాను ఓడించిన ఆరో క్రీడాకారిణిగా ముగురుజా నిలిచింది. గతంలో వీనస్ (2001 యూఎస్, 2008 వింబుల్డన్), షరపోవా (2004 వింబుల్డన్), సమంతా స్టోసుర్ (2011 యూఎస్ ఓపెన్), ఎంజెలిక్ కెర్బర్ (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్) మాత్రమే సెరెనాను గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించారు. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకాలం నేను పడిన శ్రమకు ఫలితం వచ్చింది. క్లే కోర్టులపై ఆడుతూనే పెరిగాను. ఈ గెలుపు నాతోపాటు స్పెయిన్‌కు ఎంతో ప్రత్యేకం. వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడకు వస్తాను -ముగురుజా