ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు... పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు లభించిన ఆరంభం ఇది. ప్రత్యర్థి బౌలింగ్ పదును చూస్తుంటే ఇన్నింగ్స్ కుప్పకూలుతుందేమో అనిపించింది. అయితే తన స్థాయికి తగిన ఆటతో కెప్టెన్ విరాట్ కోహ్లి, కౌంటర్ అటాక్‌తో వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత్‌ను కాపాడారు. పట్టు చిక్కిందనుకున్న ఆస్ట్రేలియాను సమర్థంగా అడ్డుకొని రెండో రోజును సంతృప్తిగా ముగించారు. ఇంకా 154 పరుగులు వెనుకబడి ఉండటంతో పూర్తిగా సురక్షిత స్థితికి వచ్చిందని చెప్పలేం కానీ ఇప్పటి వరకు జరిగిన ఆటను బట్టి చూస్తే భారీ ఆధిక్యం కోల్పోయే ప్రమాదం మాత్రం తక్కువగా ఉంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కీలకంగా మారిన నేపథ్యంలో... 2014 మెల్‌బోర్న్ టెస్టు భాగస్వామ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ఆడిన కోహ్లి, రహానే జోడి మూడో రోజు ఎంత సేపు నిలబడుతుందనే దానిపైనే భారత్ ఆశలు నిలిచాయి.
పెర్త్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (181 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), అజింక్య రహానే (103 బంతుల్లో 51 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు అభేద్యంగా 90 పరుగులు జోడించారు. మూడో వికెట్‌కు కూడా పుజారా (103 బంతుల్లో 24; 1 ఫోర్)తో కలిసి కోహ్లి కీలక 74 పరుగులు జత చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 277/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టిమ్ పైన్ (89 బంతుల్లో 38; 5 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మకు 4 వికెట్లు దక్కగా... బుమ్రా, విహారి, ఉమేశ్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
49 పరుగులు జోడించి...
రెండో రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరో 18.3 ఓవర్ల పాటు సాగింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ పైన్, కమిన్స్ (19) భాగస్వామ్యం ఆసీస్‌ను ముందుకు నడిపించింది. వీరిద్దరు కలిసి స్కోరును 300 పరుగులు దాటించారు. ఏడో వికెట్‌కు 59 పరుగులు జోడించిన అనంతరం కమిన్స్‌ను బౌల్డ్ చేసి ఉమేశ్ ఈ జోడీని విడదీశాడు. మరో రెండు బంతులకే బుమ్రా బౌలింగ్‌లో పైన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వరుస బంతుల్లో స్టార్క్ (6), హాజల్‌వుడ్ (0)లను ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌కు ఇషాంత్ తెర దించాడు.
కోహ్లి, పుజారా జాగ్రత్తగా...
భారత ఓపెనర్లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లండ్‌లో రెండో టెస్టులో రెండు డకౌట్లతో చోటు కోల్పోయి అడిలైడ్‌లో పునరాగమనం చేసిన మురళీ విజయ్ మరో ‘డక్’ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్క్ వేసిన చక్కటి బంతికి విజయ్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. లంచ్ విరామం తర్వాత హాజల్‌వుడ్ యార్కర్ రాహుల్ (2) వికెట్లను గిరాటేసింది. ఈ దశలో కోహ్లి, పుజారా చాలా జాగ్రత్త పడ్డారు. పరుగులు రాకపోయినా వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ఆరంభంలో హాజల్‌వుడ్ ఓవర్లో కోహ్లి మూడు ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని సంయమనం ప్రదర్శించగా, పుజారా కూడా తనదైన శైలిలో అండగా నిలిచాడు. ముఖ్యంగా కమిన్స్, లయన్ జోడి భారత్ బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టి పడేయడంతో పరుగులు రావడమే గగనంగా మారింది. ఈ జోడి అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఏకంగా 135 బంతులు తీసుకుంది. టీ విరామం తర్వాత 23 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ కోసం ఆస్ట్రేలియా రివ్యూ కోరినా ఫలితం దక్కలేదు. అయితే మరో పరుగు మాత్రమే జోడించిన పుజారాను స్టార్క్ వెనక్కి పంపడంతో కంగారూలు ఊపిరి పీల్చుకున్నారు.
రహానే దూకుడు...
కీలకమైన పుజారాను ఔట్ చేశామన్న ఆసీస్ ఆనందంపై రహానే నీళ్లు చల్లాడు. వచ్చీ రాగానే ధాటిని ప్రదర్శించిన అతను చకచకా బౌండరీలతో దూసుకుపోయాడు. స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్‌కట్‌తో అతను కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. మరోవైపు 109 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి కూడా జోరు పెంచాడు. చివరి గంటలో వీరిద్దరు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో రెండు అద్భుతమైన షాట్లతో ఫోర్లు కొట్టిన రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 8/2 స్కోరు వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను కాపాడాల్సిన బాధ్యత కోహ్లి, పుజారాలపై పడింది. ఒకవైపు పేసర్ కమిన్స్ కచ్చితత్వంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే... మరో ఎండ్‌లో లయన్ టర్న్, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను కదలనీయలేదు. ఫలితంగా భారత్ పరుగు పరుగుకూ శ్రమించింది.
కమిన్స్, లయన్ కలిపి వరుసగా వేసిన పది ఓవర్లలో (13 నుంచి 22 ఓవర్ల వరకు) టీమిండియా 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాట్‌కు అతి సమీపంగా వెళ్లి కీపర్ చేతుల్లో పడిన బంతులు... ఫీల్డర్లకు కాస్త ముందుగా పడి అదృష్టవశాత్తూ క్యాచ్ కాకుండా ఉండి పోయిన షాట్‌లు... స్టంప్స్‌ను దాదాపు తాకుతూ వెళ్లిన బంతి... ఇలా అనేక ఉత్కంఠభరిత క్షణాలను భారత బ్యాట్స్‌మెన్ అధిగమించారు. అయితే వికెట్ మాత్రం చేజార్చుకోకపోవడం విశేషం. కోహ్లిలాంటి ఆటగాడు క్రీజ్‌లో ఉన్నప్పటికీ 22 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. 10వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన తర్వాత 32వ ఓవర్లో గానీ కోహ్లి ఫోర్ బాదలేదు. రెండో సెషన్‌లో 29 ఓవర్లు ఆడిన భారత్ 64 పరుగులు మాత్రమే చేసింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) రహానే (బి) విహారి 70; ఫించ్ (ఎల్బీ) (బి) బుమ్రా 50; ఖాజా (సి) పంత్ (బి) ఉమేశ్ 5; షాన్ మార్‡్ష (సి) రహానే (బి) విహారి 45; హ్యాండ్స్‌కోంబ్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 7; హెడ్ (సి) షమీ (బి) ఇషాంత్ 58; పైన్ (ఎల్బీ) (బి) బుమ్రా 38; కమిన్స్ (బి) ఉమేశ్ 19; స్టార్క్ (సి) పంత్ (బి) ఇషాంత్ 6; లయన్ (నాటౌట్) 9; హాజల్‌వుడ్ (సి) పంత్ (బి) ఇషాంత్ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (108.3 ఓవర్లలో ఆలౌట్) 326.
వికెట్ల పతనం: 1–112; 2–130; 3–134; 4–148; 5–232; 6–251; 7–310; 8–310; 9–326; 10–326.
బౌలింగ్: ఇషాంత్ 20.3–7–41–4; బుమ్రా 26–8–53–2; ఉమేశ్ 23–3–78–2; షమీ 24–3–80–0; విహారి 14–1–53–2; విజయ్ 1–0–10–0.
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) హాజల్‌వుడ్ 2; విజయ్ (బి) స్టార్క్ 0; పుజారా (సి) పైన్ (బి) స్టార్క్ 24; కోహ్లి (బ్యాటింగ్) 82; రహానే (బ్యాటింగ్) 51; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (69 ఓవర్లలో 3 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–6; 2–8; 3–82.
బౌలింగ్: స్టార్క్ 14–4–42–2; హాజల్‌వుడ్ 16–7–50–1; కమిన్స్ 17–3–40–0; లయన్ 22–4–34–0.
Comments
Please login to add a commentAdd a comment