చర్చిలోనే కొడుకును చంపేశారు!
ఇద్దరు టీనేజ్ సోదరులపై చర్చిలో పాశవిక దాడి జరిగింది. ఆరుగురు కలిసి.. పొత్తికడుపు, మర్మాయవాలు పూర్తిగా ఛిద్రమయ్యేలా వారిద్దరిని చితకబాదారు. చివరికి దాడిచేసినవాళ్లే ఆ యువకులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకునేలోపే పెద్దోడు చనిపోయాడు. చిన్నోడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ఆరుగురిలో ఇద్దరు సాక్షాత్తు ఆ యువకుల తల్లిదండ్రులు! బాలీవుడ్ సినిమా మలుపులను తలపిస్తున్న ఈ ఘటనలో.. మృతుడి తల్లిదండ్రులు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
న్యూయార్క్ నగర శివారులోని న్యూ హార్ట్ ఫీల్డ్ ప్రాంతంలో నివసించే బ్రూస్ (65), దెబొరా (59)లకు ఇద్దరు కొడుకులు. పేర్లు లూకస్ (19), క్రిస్టోఫర్ (17) ఆ ప్రాంతంలో ఉండేవాళ్లంతా 'వర్డ్ ఆఫ్ లైఫ్' చర్చికి వెళతారు. గత సోమవారం అదే చర్చిలో లూకస్, క్రిస్టోఫర్ లపై అనూహ్యరీతిలో దాడి జరిగింది. తల్లి దండ్రులు బ్రూస్, దెబోరాలతోపాటు చర్చికి చెందిన జోసెఫ్, డేవిడ్, లిండా, సారా అనే మరో నలుగురు వ్యక్తులు సోదరులను తీవ్రంగా కొట్టి, కొద్దిసేపటి తర్వాత ఆసుపత్రిలో చేర్చారు. లూకస్ చనిపోగా, క్రిస్టోఫర్ చికిత్స పొందుతున్నాడు. అయితే..
ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ హత్యకు కారణం తెలియరాలేదు. దీంతో చర్చి సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతైన పరిశోధనలు మొదలుపెట్టారు. మరోవైపు ఒనెయిడా కంట్రీ జైలులో ఉన్న నిందితులనూ విచారించారు. లూకస్, క్రిస్టోఫర్ లు నిందితుల అసలు పిల్లలేనా? క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే చర్చిలోనే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఘటన జరిగినప్పుడు చర్చిలో ఎవరెవరున్నారు? తదితర చిక్కుముడులను విప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉందని హార్ట్ ఫోర్ట్ పోలీస్ అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగానే నిందితులకు కోర్టులో బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరు లక్ష డాలర్ల పూచీకత్తు చెల్లించి జైలు నుంచి విముక్తి పొందొచ్చని కోర్టు పేర్కొంది. కానీ విడుదలయ్యేందుకు నిందితులు సిద్ధంగా లేరని వారి తరఫు న్యాయవాది తెలిపారు. మరి అలాంటప్పుడు బెయిల్ దరఖాస్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.