న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 2,494 మంది కోవిడ్-19తో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 55,417కు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 16 వేల కరోనా మరణాలు సంభవించాయి. రెండున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే దాని నుంచి మానవాళి విముక్తి పొందగలిగే అవకాశాలున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అమెరికా సహా యూకే, చైనా, భారత్ వంటి దేశాలు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. (వూహాన్‌లో కోవిడ్ రోగులు నిల్)
ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన డాక్టర్ స్టాన్లీ ప్లాట్కిన్ తాను సైతం కరోనాపై పోరులో అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ‘గాడ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్’గా ప్రసిద్ధిగాంచిన ఆయన రూబెల్లా నుంచి అమెరికాను కాపాడిన విషయం తెలిసిందే. ఆంథ్రాక్స్, పోలియో, రేబిస్, రోటా వైరస్ వ్యాక్సిన్ల రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు. తాజాగా కరోనాను విరుగుడు కనిపెట్టేందుకు 87 ఏళ్ల వయస్సులో ఫార్మాసుటికల్ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం గురించి ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాను అంతం చేసేందుకు వ్యాక్సిన్ త్వరలోనే కనిపెట్టగలమనే నమ్మకం ఉంది. అయితే సినిమాల్లో చూపించినట్లుగా కేవలం రాత్రికి రాత్రి ఇది జరిగిపోదు. ప్రస్తుతం అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంది. కోవిడ్-19లో పలు రకాల జాతులు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేకపోవచ్చు. కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే ఐసోలేషన్ ప్రక్రియ తప్పనిసరి. అలా చేయని పక్షంలో దాదాపు 70 నుంచి 80 శాతం మందికి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి’’అని హెచ్చరించారు.(కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment