ఆన్‌లైన్ స్కామ్‌తో ‘కొంప’ కొల్లేరయింది
లండన్: 28 ఏళ్ల సారా, 34 ఏళ్ల రిట్చీ ఇటీవలనే పెళ్లి చేసుకున్నారు. వారు అందరిలాగానే సొంతింటి కళలు కన్నారు. హార్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని బిషప్స్ స్టార్ట్‌ఫోర్డ్ ప్రాంతంలో ఓ త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని కొనాలనుకున్నారు. ఇదే లక్ష్యంతోని ఓ దశాబ్దకాలంగా వారు పైసా పైసా కూడబెడుతూ వచ్చారు. మధ్యవర్తులైన ‘అడ్వాంటేజ్ ప్రాపర్టీ లాయర్స్’ను సంప్రదించారు. పెళ్లైన కొత్త జంటకు, ప్రాపర్టీ లాయర్లకు మధ్య ఇల్లు కొనుగోలుకు సంబంధించి ఈ మెయిల్స్ రూపంలో లావాదేవీలు నడిచాయి. చివరకు బేరం కుదిరింది.
గత డిసెంబర్ రెండో వారంలో దాదాపు రెండు కోట్ల రూపాయల ఇల్లుకు అడ్వాన్స్ కింద 45 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా ‘అడ్వాంటేజ్ ప్రాపర్టీ లాయర్స్’ సంస్థ నుంచి ఇంటి కొనుగోలు వ్యవహారాలను స్వయంగా చూస్తున్న సారాకు ఈ మెయిల్ వచ్చింది. ఆ మరుసటి రోజే, అంటే డిసెంబర్ 17వ తేదీన ప్రాపర్టీ లాయర్ల సంస్థ నుంచి మరో ఈ మెయిల్ వచ్చింది. తాము ఇంతకుముందు పంపించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆడిటింగ్‌లో ఉందని, ఇప్పడిస్తున్న కొత్త అకౌంట్ నెంబర్‌కు డబ్బును బదిలీ చేయాల్సిందిగా ఆ మెయిల్‌లో ఉంది. దాని ప్రకారమే సారా 45 లక్షల రూపాయలను బార్క్లేస్ బ్యాంక్ బ్రాంచ్‌కు బదిలీ చేసింది.
ఇక సారా, రిట్చీలు కొత్తింట్లోకి ప్రవేశించేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇంతలో ప్రాపర్టీ లాయర్ల సంస్థ నుంచి మళ్లీ మెయిల్ వచ్చింది. ఇంతవరకు తమకు అడ్వాన్స్ డబ్బులు ముట్టలేదని, త్వరగా పంపించాలన్నది ఆ మెయిల్ సారాంశం. సారాకు, సంస్థ ప్రతినిధులకు మధ్య వాదోపవాదాలు జరిగినంతరం అసలు మోసం తెల్సింది. కొనుగోలు దారులు, ప్రాపర్టీ లాయర్ల మధ్య నడిచిన లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిళ్లను దుండగులు హ్యాక్ చేశారు. ప్రాపర్టీ సంస్థ తరఫున దొంగ మెయిల్స్ పంపించి సారా జంట కొంప ముంచారు. జరిగిన మోసానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సారా వారి సాయంతో బ్యాంక్ బ్రాంచికి వెళ్లి ఎంక్వైరీ చేశారు.
ఆమె ఖాతాలో మిగిలిన మొత్తాన్ని స్తంభింపచేసిన బ్యాంక్ అధికారులు దొంగ ఖాతాదారులు ఒకే రోజు మూడు బ్రాంచ్‌ల నుంచి వీలైనంత మేరకు పెద్ద మొత్తాలను డ్రాచేసి ఉడాయించారని చెప్పారు. పోయిన సొమ్ముకు తామే మాత్రం బాధ్యత వహించలేమని, ఖాతాలు సవ్యంగా నడుస్తున్నప్పుడు కొంత మంది దుర్బుద్ధితో ఇలాగా మోసం చేస్తారని భావించలేంగదా! అన్నది వారి సమాధానం. దొంగ ఖాతాలను మూసివేయడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నా ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు జరుగుతుంగే తాము మాత్రం ఏం చేయలమని, సానుభూతి చూపించడం తప్పా అన్నది వారి వివరణ.
ఇలాంటి నేరాలను పరిశోధించే నిఘా విభాగానికి వెళ్లి ఐటీ నిపుణులతో ఈ మెయిళ్లు ఎక్కడి నుంచి జనరేట్ అయ్యాయో కనుగొనేందుకు సారా దంపతులు ప్రయత్నించారు. ఇందులో దొంగ మెయిళ్లు ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. పోలీసులు మళ్లీ వెళ్లి ప్రాపర్టీ లాయర్ల సంస్థకు వెళ్లి ఎంత విచారించినా ఆ సంస్థ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు. బాధితులే తమ కంప్యూటర్ వ్యవస్థ, ఈ మెయిళ్లు భద్రంగా ఉన్నాయో, లేవో చూసుకోవాలని, లావాదేవీలు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఫోన్ ద్వారా కూడా ముందుగా ధ్రువీకరించుకోవాలని బ్యాంక్, పోలీసు అధికారులు, ప్రాపర్టీ సంస్థ ఉద్యోగులు ఉచిత సలహా ఇచ్చారు.
ఇలాంటి మోసాలు కూడా జరగుతాయని తామెన్నడు ఊహించలేదని ఓ కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సారా, ఓ వైన్ కంపెనీకి డెరైక్టర్‌గా పనిచేస్తున్న రిట్చీ ఆవేదన వ్యక్తం చేశారు. బంధు మిత్రులెవరైనా అప్పిస్తే ఇల్లు కొంటామని, లేకపోతే ఇల్లు గురించి మరచిపోతామని అన్నారు.