సోషల్ మీడియాలో డాన్స్ పోలీస్ డాన్స్!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పోలీసులు తమ విభాగంలో నియామకాలను ప్రోత్సహించడం కోసం సోషల్ మీడియాలో ఓ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. 1995 నాటి మ్యూజిక్ ట్రాక్ ‘మై బూ మై గోస్ట్ టౌన్ డీజేస్’ ట్యూన్‌కు అనుగుణంగా అడుగులు వేస్తూ న్యూజిలాండ్ పోలీసులు డాన్స్ చేశారు. ఆ వీడియోను ఆదివారం నాడు సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రపంచ పోలీసు బలగాలను ఇదే రీతిన స్పందించాల్సిందిగా కోరారు.
పరారీలోవున్న నేరస్తులను తాము ప్రతిరోజు చాలెంజ్ చేసి పట్టుకుంటామని, ఈ ‘రన్నింగ్‌మేన్ ఛాలెంజ్’ తమకు కొత్త ఛాలెంజ్ అంటూ న్యూజిలాండ్ పోలీసులు పోస్ట్ చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. వాళ్ల ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని న్యూయార్క్ పోలీసులు కూడా కొంత మంది స్థానిక విద్యార్థుల సహాయంతో డాన్స్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత స్కాట్‌లాండ్ పోలీసులు, దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు, క్వీన్స్‌లాండ్ పోలీసు సర్వీస్ పోలీసులు ఇదే తరహాలో స్పందించారు.
1995 నాటి ‘మై బూ మై గోస్ట్ టౌన్ డీజేస్’ ట్రాక్‌ను న్యూజిలాండ్ పోలీసులు ఎంపిక చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అప్పట్లో టాలెంట్ హంట్‌లో భాగంగా ఈ పాటకు అనుగుణంగా డాన్స్ చేసి వీడియోలు పంపించాల్సిందిగా ప్రజలను కోరేవారు. న్యూజిలాండ్‌లో ఖాళీగా ఉన్న 400 పోలీసు పోస్టుల భర్తీని ప్రోత్సహించడం కోసం ప్రారంభించిన డాన్స్ ట్రెండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఏదో రోజు ఇది భారత్‌కు కూడా వ్యాపించవచ్చు. మన పోలీసులు ఎలా డాన్స్ చేస్తారో చూడాల్సిందే.