
అబుజా : ‘చావుపుట్టుకలు దైవాధీనం’.. ఇది ఒకప్పటి మాట. మరి నేడో.. రేటింగ్స్ కోసం.. పాపులారిటీ కోసం.. సోషల్ మీడియా సాక్షిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరినైనా చంపేస్తున్నాం. పాపం ఆనక సదరు వ్యక్తులు ‘బాబోయ్ మేం బతికే ఉన్నాం’ అంటూ టీవీల ముందుకు వచ్చి మొరపెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నైజీరియా అధ్యక్షుడు బుహారికి. మీడియా ముందుకు వచ్చి ‘నేను బతికే ఉన్నాను.. నేను నేనే. నన్ను నమ్మండి’ అంటూ వాదించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది బుహారికి.
విషయం ఏంటంటే గత ఏడాది గుర్తు తెలియని వ్యాధి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లారు బుహారి. ఎక్కువ రోజులు అక్కడే ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే తిరిగి స్వదేశానికి వచ్చారు. కానీ ఈ లోపే ఆయన చనిపోయినట్లు.. ఆ స్థానంలో బుహారిని పోలిన మరో వ్యక్తి పరిపాలన సాగిస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి. పొరుగున ఉన్న సూడాన్ నుంచి అచ్చం బుహారి లాంటి వ్యక్తినే తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే గాసిప్స్ తారస్థాయికి చేరాయి. అంతటితో ఆగక ఆ వ్యక్తి పేరు జబ్రిల్ అని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. స్వదేశానికి వచ్చిన బుహారికి ఈ వదంతుల గురించి తెలిసింది కానీ పెద్దగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు పోలండ్ వెళ్లిన బుహారీ ప్రవాస నైజీరియన్లను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడికి వచ్చిన అతిథులందరూ ఇతర విషయాలను వదిలేసి ఈ వదంతుల గురించి ప్రస్తావించడంతో ఆయన ‘నేనే బాబూ.. బతికే ఉన్నాను.. డమ్మీని కాను’ అని చెప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాక తన గురించి ఇలాంటి వదంతులు ప్రచారం చేసిన వారు అజ్ఞానులు, మతం పట్ల గౌరవం లేనివాళ్లంటూ ఆయన మండిపడ్డారు. వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి తిరిగి పోటీచేయాలని భావిస్తున్నారు బుహారీ. దాంతో ప్రత్యర్ధులు ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి వదంతులు వ్యాపింపచేశారు. బుహారి లండన్‌లో ఎక్కువ రోజులు గడపడం కూడా వారికి ఉపయోగపడింది. అయితే బుహారి ఇప్పటి వరకూ ఆయనకు ఉన్న వ్యాధి ఏమిటో వెల్లడించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment