అమెరికాలో జరిగిందే భారత్‌లో జరుగుతోంది...
అమెరికాలో జరిగిందే భారత్‌లో జరుగుతోంది...
Published Wed, Mar 29 2017 6:17 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
న్యూఢిల్లీ: అమెరికాలో ఫిబ్రవరి 22వ తేదీన 'మా దేశం నుంచి వెళ్లిపో' అంటూ భారతీయ ఇంజనీరు శ్రీనివాస్ కూచిబొట్లను స్థానిక అమెరికా జాతి విద్వేషకుడు అన్యాయంగా కాల్చి చంపాడు. ఈ సంఘటన పట్ల ఇటు భారత్‌తోపాటు అటు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'నా భర్తను పొట్టన పెట్టుకున్న ఈ జాతి విద్వేష సంఘటనకు నాకు సమాధానం చెప్పి తీరాలి' అంటూ శ్రీనివాస్ భార్య ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అమెరికాను సందర్శించే ప్రతి విదేశీయుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనంటూ భారత ప్రభుత్వం కర్తవ్య బోధన చేసింది. 'అయ్యో!' భారతీయుల డాలర్ కలలు కరగిపోతున్నాయంటూ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.
మరి ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో గత శుక్రవారం నుంచి చోటు చేసుకుంటున్న సంఘటనలు, పరిమాణాల మాటేమిటి? సోమవారం నాడు పలుసార్లు, దాదాపు 40 మంది నైజీరియన్ విద్యార్థులపై చేతులు, కాళ్లు విరిగేలా దాడులు జరపడం, బుధవారం నాడు కెన్యా యువతిపై దాడి చేయడం, నోయిడా నుంచి నైజీరియన్లు ఖాళీచేసి పోవాలంటూ భారతీయులు హెచ్చరికలు చేయడం జాతి విద్వేష దాడులు కావా? అన్ని అంశాలపై వేగంగా స్పందిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ఈ సంఘటనలపై తక్షణం స్పందించకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నారు? వెనకాముందు ఆలోచించకుండా నైజీరియన్లు నరమాంసభక్షకులని ముద్రవేసిన వారు నిజం తెలిశాకైనా తమ తప్పు తెలసుకున్నారా?
2015 లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 50 వేల మంది నైజీరియన్ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఢిల్లీ, డిల్లీకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లోని యూనివర్శిటీల్లో చదువుకుంటున్నారు. వారిలో కొంత మంది హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండగా, మిగతా వారు బృందాలుగా అద్దె ఇళ్లు తీసుకొని ఉంటున్నారు. నోయిడాలోని ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్స్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న మనీష్ కరీ అనే 12వ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు.
నైజీరియా విద్యార్థులతో వెళ్లడం చివరిసారి చూసినట్లు ఆ యువకుడి కోసం వెతుకుతున్న వారికి ఎవరో చెప్పారు. శనివారం తెల్లవారుజాము వరకు మనీష్ జాడ కనిపించకపోవడంతో నైజీరియా విద్యార్థులు నరమాంస భక్షకులని, మనీష్‌ను చంపేసి, తినేసి ఉంటారని వదంతులు వ్యాపించాయి. ఆ తర్వాత అదశ్యమైన మనీష్ క్షేమంగానే ఇంటికి తిరిగొచ్చారు. ఈలోగా మాదకద్రవ్యాలు ఎక్కువగా తీసుకొని మరణించిన ఓ 19 ఏళ్ల యువకుడి కేసులో డ్రగ్స్ సరఫరా చేశారన్న అనుమానంపై ఐదుగురు నైజీరియన్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో విడుదల చేశారు.
ఈ రెండు సంఘటనలో ఎన్‌క్లేవ్ వాసులు ఉద్రిక్తులయ్యారు. వెంటనే నోయిడా ప్రాంతంలోని నైజీరియన్లు ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ వారు సోమవారం సాయంత్రం దాదాపు రెండువేల మందితో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా రోడ్డు మీద కనిపించిన నైజీరియన్లతో, ప్రదర్శనల్లో పాల్గొన్న కొన్ని మూకలు గొడవలు పెట్టుకొని, వారిని తరమి తరమి కొట్టాయి. సోమవారం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య పారి చౌక్, మిత్రా సొసైటీ, బేటీ వన్, బేటా టూ ప్రాంతాల్లో దాదాపు 40 మంది నైజీరియన్లపై దాడులు జరగ్గా, వారిలో పది మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురికి చేతులు, కాళ్లు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు తప్ప నైజీరియన్ విద్యార్థులు మంగళవారం నాడు నోయిడాలోని హాస్టళ్లను గదులను ఖాళీ చేసి ఢిల్లీ ప్రాంతానికి, మిత్రుల వద్దకు తరలిపోయారు.
తాను కోలుకున్నాక నైజీరియా తిరిగి వెళ్లిపోతానని, మళ్లీ భారత్‌కు రానని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవోల్ అలియు అనే నైజీరియా విద్యార్థి మీడియా ముందు వాపోయారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు కెన్యా మహిళపై దాడి జరిగింది. పోలీసులు రెండు కేసులను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన శ్రీనివాస్ హత్యకు మనం ట్రంప్‌ను బాధ్యుల్ని చేస్తున్నాం. ఇప్పుడు నైజీరియన్లకు వ్యతిరేకంగా జరగుతున్న ఈ జాతి విద్వేశ దాడులకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి?
Advertisement