
ఎటువంటి ఆంక్షలు లేకుండా విద్యార్థులకు వీసాలు
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయని ఆ దేశ హై కమిషనర్ డొమ్నిక్ అస్కిత్ అన్నారు. యూకేలోని విశ్వవిద్యాలాయాలు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నాయని ఆయన అన్నారు. మహిళా ఆర్థిక సాధికారికతపై యూఎన్ నివేదికను ఆవిష్కరిస్తున్న సభలో పలు అంశాలపై అస్కిత్ మాట్లాడారు. భారతీయ విద్యార్థుల కోసం ఎలాంటి పరిమితులు లేకుండానే బ్రిటన్‌లో చదువుకునేందుకు వీసాలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.
దాదాపు 600 మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్‌షిప్ అందజేస్తోందని ఆయన వివరించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలనుంచి వచ్చి బ్రిటన్‌లో చదువుకుంటున్నట్లు తెలిపారు. కోర్సు అయిపోగానే విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లేలా వీసా విధానాన్ని బ్రిటన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. మహిళా సాధాకారికత కోసం ఉద్ధేశించిన 75 స్టార్టప్‌లపై బ్రిటన్ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో ఉన్న బ్రిటన్ కంపెనీలు వారి ఆదాయంలో 7శాతం ఉద్యోగుల స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు పెడుతున్నట్లు అస్కిత్ వెల్లడించారు.