అక్కడిక తొమ్మిదో తరగతి లేదు!
తాలిబన్లు అత్యంత పాశవికంగా దాడిచేసిన పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఇక తొమ్మిదో తరగతి అన్నదే లేదు! దాడి జరిగిన సమయానికి అసలు స్కూలుకే వెళ్లని ఒక్క దావూద్ ఇబ్రహీం అనే విద్యార్థి మాత్రమే ఆ తరగతిలో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అతడి ఇంట్లో అలారం మోగకపోవడంతో స్కూలుకు వెళ్లలేకపోయాడు. ముందురోజు రాత్రి ఓ పెళ్లికి వెళ్లడంతో బాగా ఎక్కువసేపు నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి.. తన క్లాసులో ఒక్కళ్లూ మిగల్లేదు. అంతా మరణించారు. దాంతో దావూద్.. వాళ్ల అంత్యక్రియలకు మాత్రమే వెళ్లగలిగాడు.
9 మంది తాలిబన్లు 8 గంటల పాటు అత్యంత పాశవికంగా జరిపిన దాడిలో 132 మంది విద్యార్థులు మరణించారు. వాళ్లలో చాలామందిని లైనులో నిలబెట్టి, పాయింట్ బ్లాంక్ రేంజిలో తలపై కాల్చి చంపేశారు. ఆరుగురు స్నేహితుల అంత్యక్రియలకు వెళ్లి వచ్చిన తర్వాత తన తమ్ముడి నోట మాట రావట్లేదని దావూద్ అన్న చెప్పాడు. జూడో నేర్చుకున్న దావూద్ చాలా దృఢంగానే ఉండేవాడని, కానీ అంతమందిని రక్తమోడుతూ చూసేసరికి మూగబోయాడని అన్నాడు. స్కూలు ప్రిన్సిపాల్ సహా మొత్తం 143 మంది ఈ దాడిలో మరణించారు. అలారం మూగబోవడంతో.. ఇక దావూద్ జీవితమే మూగబోయిందని అక్కడున్న ఓ పెద్దాయన వ్యాఖ్యానించారు.