లండన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గ్రూప్ చీఫ్ ముల్లాహ్ అక్తర్ మన్సూర్ మృతిని ధ్రువీకరించలేమని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు. అమెరికా సైనిక దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ హతమైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవాజ్ లండన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాలిబాన్ చీఫ్ మృతిపై తమకు ఇంకా నివేదికలు అందాల్సి ఉందన్నారు. మాన్సుర్ మృతిని ధ్రువీకరించేందుకు విచారణ జరుపుతున్నట్లు నవాజ్ పేర్కొన్నారు. అయితే డ్రోన్ దాడులకు సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇందుకు సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్లో మాట్లాడినట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలంలో వలీ మొహమద్ పేరుతో ఉన్న ఓ పాస్పోర్టు లభించినట్లు పాక్ అధికారి తెలిపారు. వైమానిక దాడుల్లో మృతి చెందినవారిలో ఓ మృతదేహాన్ని స్థానిక ట్యాక్సీ డ్రైవర్గా గుర్తించినట్లు చెప్పారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. కాగా తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు.
తాలిబాన్ నేత మృతిని ధ్రువీకరించలేం: షరీఫ్
Published Mon, May 23 2016 8:33 AM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM
Advertisement