తన గురించి చర్చించుకునేందుకే ఆ ప్రకటన! | No evidence of al-Qaeda's presence in India | Sakshi
Sakshi News home page

తన గురించి చర్చించుకునేందుకే ఆ ప్రకటన!

Published Mon, Sep 8 2014 8:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

పీటర్ బెర్గెన్

పీటర్ బెర్గెన్

వాషింగ్టన్:  అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌లో ఉందనడానికి తగిన ఆధారాల్లేవని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడు పీటర్ బెర్గెన్ అన్నారు. ఆల్ ఖైదా అధినేత అయ్‌మన్ అల్ జవహిరి భారత్‌లో ఒక శాఖను ప్రారంభించబోతున్నారన్న భావనే ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుందన్నారు.  అయితే, భారత్‌లో కొన్ని జీహాద్ శక్తులున్నా, ఆల్ ఖైదా ఉనికికి మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తెలిపారు.

తన గురించి మనలాంటి వారు చర్చించుకునేలా చేసేందుకే జవహిరి ఈ ప్రకటన చేశారని బెర్గెన్ వ్యాఖ్యానించారు.  భారత్‌లోఆల్ ఖైదా శాఖ ప్రారంభంపై దేశవ్యాప్తంగా అప్రమత్తత నెలకొన్న నేపథ్యంలో,.. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ బెర్గెన్ ఈ వ్యాఖ్య చేశారు. భారత ఉపఖండంలో విడిగా ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు జవహిరి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా ప్రతిస్పందించారు. ఉగ్రవాద నిర్మూలన అంశంపై ఎన్నో పుస్తకాలు రాసిన పీటర్ బెర్గెన్‌కు, దక్షిణాసియాలో ఆల్ ఖైదా కార్యకలాపాలపై ఎంతో పరిజ్ఞానం ఉన్న నిపుణుడుగా పేరుంది.

తన ఉనికిని చాటుకునేందుకు  ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా  తాజాగా భారత శాఖను ప్రారంభిస్తున్నట్లు  ఆ సంస్థ చీఫ్ అయ్ మాన్ ఆల్ జవహిరి ప్రకటించారు.  ఆయన ప్రసంగంతో కూడిన 50 నిమిషాల వీడియోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. భారత భూభాగంలో అన్యాయానికి గురవుతున్న ముస్లింలకు బాసటగా నిలిచేందుకే ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆల్ ఖైదాలో పాక్ షరియా కమిటీ చీఫ్గా వ్యవహరిస్తున్న ఆసిమ్ ఉమర్, భారత విభాగం చీఫ్గా కొనసాగుతారని జవహిరి ప్రకటించారు. ఒసామా బిన్ లాడెన్ మరణించిన తరువాత ఆ సంస్థ బాధ్యతలను  జవహిరి  స్వీకరించారు. లాడెన్ బతికున్నప్పుడు కూడా ఆయనకు ముఖ్య అనుచరుడిగా జవహిరి వ్యవహరించారు. ఆయనకు కరడుగట్టిన ఉగ్రవాదిగా  పేరుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement