Ayman al-Zawahiri
-
అల్‌ఖైదా అగ్రనేత జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: అల్‌ఖైదా అగ్రనాయకుడు అమాన్ అల్-జవహరీ మృతిపై తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా అల్‌ఖైదా అధినేత అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అప్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్ 11న (9/11 హైజాక్) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్ల పరస్పర విభిన్న ప్రకటనలతో అల్‌ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది కూడా చదవండి: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన -
అల్ ఖైదా అగ్రనేత అల్ జవహరీని హతమార్చిన అమెరికా
-
అల్ ఖైదా చీఫ్ అల్-జవహరి హతం
-
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
-
మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
బీరూట్: కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. ఈ విషయాన్ని జిహాదిస్టు వెబ్సైట్లను మానిటర్ చేసే సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ వెల్లడించింది. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించాడు. అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడంపైనా మాట్లాడాడు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రస్తావిచంలేదు. దీంతో ఈ వీడియో జనవరి తర్వాత రికార్డు చేసి ఉండవచ్చని సైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ అభిప్రాయపడింది. 2020 ఫిబ్రవరిలోనే అమెరికా–తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాని గురించి మాట్లాడటాన్ని బట్టి వీడియో తాజాది అని చెప్పలేమని సైట్ పేర్కొంది. 2020 చివరలో ఆయన అనారోగ్యంతో మరణించి ఉంటాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదలైంది. మొత్తం 61 నిమిషాల, 37 సెకెన్ల నిడివి ఉన్న వీడియో విడుదలైందని సైట్ డైరెక్టర్ రిటా కాట్జ్ తెలిపారు. 2021 జనవరి తర్వాత ఆయన మరణించి ఉండవచ్చని అన్నారు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్కాయిదా చీఫ్‌గా మారాడు. -
సజీవంగానే అల్ జవహిరి
ఐక్యరాజ్యసమితి: అల్–ఖాయిదా అగ్ర నాయకత్వంలో చాలావరకు అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోనే తిష్టవేసి ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని ఆ సంస్థ నేత అయిమన్ అల్–జవహిరి సజీవంగానే ఉండి ఉండవచ్చని అభిప్రాయపడింది. ‘అల్–ఖాయిదా అగ్రనాయకత్వం పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. భారత ఉపఖండంలో ఉన్న మిగతా శ్రేణులతో కలిసి పనిచేస్తున్నారు. అంతా కలిపి 500 మంది వరకు ఉండవచ్చు. అతడు అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే ప్రచార వీడియోల్లో సైతం కనిపించడం లేదు’ అని ఐరాస ఆంక్షల పర్యవేక్షక బృందం తన 12వ నివేదికలో పేర్కొంది. భారత ఉపఖండంలో అల్–ఖాయిదా కార్యకలాపాలు ప్రస్తుతం ఒసామా మహమూద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని వెల్లడించింది. అల్–ఖాయిదా శ్రేణుల్లో అఫ్గాన్, పాక్, జాతీయులతోపాటు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశస్తులు కూడా ఉన్నారని పేర్కొంది. -
తన గురించి చర్చించుకునేందుకే ఆ ప్రకటన!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌లో ఉందనడానికి తగిన ఆధారాల్లేవని అమెరికాకు చెందిన ఉగ్రవాద వ్యతిరేక నిపుణుడు పీటర్ బెర్గెన్ అన్నారు. ఆల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహిరి భారత్‌లో ఒక శాఖను ప్రారంభించబోతున్నారన్న భావనే ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుందన్నారు. అయితే, భారత్‌లో కొన్ని జీహాద్ శక్తులున్నా, ఆల్ ఖైదా ఉనికికి మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తెలిపారు. తన గురించి మనలాంటి వారు చర్చించుకునేలా చేసేందుకే జవహిరి ఈ ప్రకటన చేశారని బెర్గెన్ వ్యాఖ్యానించారు. భారత్లోఆల్ ఖైదా శాఖ ప్రారంభంపై దేశవ్యాప్తంగా అప్రమత్తత నెలకొన్న నేపథ్యంలో,.. సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ బెర్గెన్ ఈ వ్యాఖ్య చేశారు. భారత ఉపఖండంలో విడిగా ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు జవహిరి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా ప్రతిస్పందించారు. ఉగ్రవాద నిర్మూలన అంశంపై ఎన్నో పుస్తకాలు రాసిన పీటర్ బెర్గెన్‌కు, దక్షిణాసియాలో ఆల్ ఖైదా కార్యకలాపాలపై ఎంతో పరిజ్ఞానం ఉన్న నిపుణుడుగా పేరుంది. తన ఉనికిని చాటుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా తాజాగా భారత శాఖను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ అయ్ మాన్ ఆల్ జవహిరి ప్రకటించారు. ఆయన ప్రసంగంతో కూడిన 50 నిమిషాల వీడియోను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. భారత భూభాగంలో అన్యాయానికి గురవుతున్న ముస్లింలకు బాసటగా నిలిచేందుకే ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆల్ ఖైదాలో పాక్ షరియా కమిటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఆసిమ్ ఉమర్, భారత విభాగం చీఫ్‌గా కొనసాగుతారని జవహిరి ప్రకటించారు. ఒసామా బిన్ లాడెన్ మరణించిన తరువాత ఆ సంస్థ బాధ్యతలను జవహిరి స్వీకరించారు. లాడెన్ బతికున్నప్పుడు కూడా ఆయనకు ముఖ్య అనుచరుడిగా జవహిరి వ్యవహరించారు. ఆయనకు కరడుగట్టిన ఉగ్రవాదిగా పేరుంది. ** -
భారత్ పై అల్‌కాయిదా నజర్
‘ఖైదత్ అల్ జిహాద్’ పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు * ముస్లిం ప్రాంతాల మధ్య సరిహద్దులను చెరిపేయడమే లక్ష్యం * తాలిబన్ నేత ముల్లా ఒమర్ నేతృత్వం * ఉపఖండంలో విస్తరిస్తామని అల్ కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటన న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని విస్తరించడం, తీవ్రతరం చేయడమే లక్ష్యంగా నిషేధిత సంస్థ అల్‌కాయిదా భారత ఉపఖండంలో కొత్త శాఖను ప్రారంభించింది. ఇస్లామిక్ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ చీఫ్ అల్ జవహరి ప్రకటించాడు. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్‌లలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు ‘ఖైదత్ అల్ జిహాద్’ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు 55 నిమిషాల నిడివి గల ఓ వీడియోను అమెరికా నిఘా సంస్థలు ఆన్లైన్లో గుర్తించాయి. ఉపఖండంలో ముస్లిం జనాభాను వేరు చేస్తున్న కృత్రిమ సరిహద్దులను చెరిపేసేందుకు తమ కొత్త దళం పనిచేస్తుందని అల్‌కాయిదా చీఫ్ పేర్కొన్నాడు. ఖైదత్ అల్ జిహాద్ సంస్థ కొత్తదేమీ కాదని, అయితే భారత ఉపఖండంలోని ముజాహిదీన్లను దీని కిందకు తేవడానికి రెండేళ్లు శ్రమించాల్సి వచ్చిందని తెలిపాడు. అల్‌కాయిదా భారత ఉపఖండంపై దృష్టిసారించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఖైదత్ అల్ జిహాద్ సంస్థ కాశ్మీర్, మయన్మార్‌లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించవచ్చన్ని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్రమత్తమైన కేంద్రం అల్‌కాయిదా తాజా వీడియో నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఈ వీడియో నిజమైనదేనని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ధ్రువీకరించడంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హడావుడిగా భద్రతాధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ తరఫున అన్ని రాష్ట్రాలకు, భద్రతా సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో అల్‌ఖాయిదా ఉనికిపై ఐబీ నిఘా పెట్టిందని, ఒకట్రెండు రోజుల్లోనే నివేదిక సమర్పిస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. కాగా, ఉపఖండంలో కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకునేందుకు అల్‌ఖాయిదా చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగ మేనని భద్రతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో అదనపు భద్రతా చర్యలు చేపడతామని ఆ రాష్ర్ట డీజీపీ ప్రకటించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని డీజీపీ రాజేంద్రకుమార్ తెలిపారు. వీడియోలో ఏముంది? అమెరికా చేతిలో హతమైన అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రసంగంతో ఈ వీడియో మొదలైంది. తర్వాత ఆసియా, పశ్చిమాసియా, భారత ఉపఖండం, ఆఫ్రికా కొమ్ముగా పిలిచే ఇథియోపియా, సోమాలియా ప్రాంతాల శాటిలైట్ మ్యాప్‌లను ప్రదర్శించారు. ఆ తర్వాత జవహరి కనిపించాడు. ఉపఖండంలో కార్యకలాపాల విస్తరణ కోసం ‘ఖైదత్ అల్ జిహాద్’ సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ నాయకత్వంలో ఈ సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నాడు. రోజువారీ కార్యకలాపాలను పాక్‌కు చెందిన ఉగ్రవాద నాయకుడు అసిమ్ ఒమర్ పర్యవేక్షిస్తాడని జవహరి వెల్లడించాడు. తన ప్రసంగంలో అస్సాం, గుజరాత్, కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతాలపై కొత్త సంస్థ దృష్టి సారిస్తుందని కూడా స్పష్టం చేశాడు. ముజాహిదీన్లకు ముస్లింలంతా సహకరించాలని పిలుపునిచ్చాడు. తర్వాత ముల్లా ఒమర్‌తో పాటు కొత్త సంస్థ అధికార ప్రతినిధి ఉసామా మహమూద్ వేర్వేరుగా మాట్లాడారు. అల్‌కాయిదా మీడియా విభాగమైన అల్ సహబ్ ఈ వీడియోను ఆన్లైన్లో విడుదల చేసింది. -
అమెరికా మీద విరుచుకుపడండి: అల్‌ఖైదా అధినేత అల్ జవహరి
అగ్రరాజ్యంగా విర్రవీగుతున్న అమెరికాపై మరిన్ని దాడులు చేయాలని, ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉన్న ఆ దేశాన్ని ఆర్థికంగా బహిష్కరించాలని అల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహరి పిలుపునిచ్చాడు. 9/11 దాడులు జరిగి పుష్కర కాలం జరిగిన సందర్భంగా చేసిన ఉద్రేకపూరిత ప్రసంగంలో జవహరి ఈ పిలుపునిచ్చాడు. ఈ ప్రసంగం వీడియో టేపులను అమెరికా నిఘా వర్గాలు సంపాదించాయి. దాదాపు 72 నిమిషాల పాటు జవహరి చేసిన ప్రసంగాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా, దాన్ని సైట్ అనే నిఘాబృందం సంపాదించింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడుల్లో దాదాపు మూడువేల మంది మరణించగా, వారి స్మృత్యర్థం అమెరికా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన రోజునే జీహాదీ వెబ్సైట్లలో ఈ ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ''మనం అమెరికాను ఆర్థికంగా పూర్తిగా కుంగదీయాలి. అది తన భద్రతా రంగం మీద భారీ స్థాయిలో పెడుతున్న ఖర్చును మరింత పెంచేలా రెచ్చగొట్టాలి. తద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చాలి. తన సైనిక, భద్రతా వ్యయాన్ని ఎక్కువ చేయడం వల్ల ఇప్పటికే అమెరికా పరిస్థితి డోలాయమానంలో పడింది'' అని జవహరి చెప్పాడు. అక్కడక్కడ కొన్ని దాడులు చేస్తే చాలు.. అమెరికా భయాందోళనలకు గురవుతుందని.. సోమాలియా, యెమెన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ లాంటి దేశాల్లో వాళ్లను మనం ఓడించినట్లే వాళ్ల సొంతదేశంలో కూడా ఓడించాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు. ఒక సోదరుడు లేదా కొద్దిమంది సోదరులు ఈ దాడులు చేస్తే సరిపోతుందని జవహరి చెప్పాడు. సరైన సమయం చూసి భారీస్థాయిలో దాడికి తెగబడాలని కూడా తెలిపాడు. చిన్న చిన్న దాడులు చేస్తూ భారీ దాడి కోసం ఓపిగ్గా వేచిచూడాలని.. అవసరమైతే అందుకు కొన్ని సంవత్సరాలు కూడా ఆగాలని చెప్పాడు. ఏప్రిల్ నెలలో బోస్టన్ మారథాన్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లను కూడా జవహరి ప్రస్తావించాడు. దాన్ని బట్టి చూస్తే అమెరికన్లు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు తెలుస్తోందని.. వాళ్ల పొగరు చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు. వాళ్ల దృష్టి మొత్తం ముస్లింల మీదే ఉంది తప్ప మరెవ్వరి మీదా కాదని చెప్పాడు. సిరియాలో ఉన్న జీహాదీలో ముస్లిమేతరులకు సాయం చేయద్దని కూడా జవహరి ఇదే ప్రసంగంలో తెలిపాడు.