
ఐక్యరాజ్యసమితి: అల్–ఖాయిదా అగ్ర నాయకత్వంలో చాలావరకు అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోనే తిష్టవేసి ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని ఆ సంస్థ నేత అయిమన్ అల్–జవహిరి సజీవంగానే ఉండి ఉండవచ్చని అభిప్రాయపడింది. ‘అల్–ఖాయిదా అగ్రనాయకత్వం పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. భారత ఉపఖండంలో ఉన్న మిగతా శ్రేణులతో కలిసి పనిచేస్తున్నారు. అంతా కలిపి 500 మంది వరకు ఉండవచ్చు. అతడు అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే ప్రచార వీడియోల్లో సైతం కనిపించడం లేదు’ అని ఐరాస ఆంక్షల పర్యవేక్షక బృందం తన 12వ నివేదికలో పేర్కొంది. భారత ఉపఖండంలో అల్–ఖాయిదా కార్యకలాపాలు ప్రస్తుతం ఒసామా మహమూద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని వెల్లడించింది. అల్–ఖాయిదా శ్రేణుల్లో అఫ్గాన్, పాక్, జాతీయులతోపాటు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశస్తులు కూడా ఉన్నారని పేర్కొంది.