అమెరికా మీద విరుచుకుపడండి: అల్ఖైదా అధినేత అల్ జవహరి | Al-Qaida chief al-Zawahiri calls for attacks and economic boycott on USA | Sakshi
Sakshi News home page

అమెరికా మీద విరుచుకుపడండి: అల్ఖైదా అధినేత అల్ జవహరి

Published Fri, Sep 13 2013 12:12 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

అమెరికా మీద విరుచుకుపడండి: అల్ఖైదా అధినేత అల్ జవహరి - Sakshi

అమెరికా మీద విరుచుకుపడండి: అల్ఖైదా అధినేత అల్ జవహరి

అగ్రరాజ్యంగా విర్రవీగుతున్న అమెరికాపై మరిన్ని దాడులు చేయాలని, ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉన్న ఆ దేశాన్ని ఆర్థికంగా బహిష్కరించాలని అల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహరి పిలుపునిచ్చాడు. 9/11 దాడులు జరిగి పుష్కర కాలం జరిగిన సందర్భంగా చేసిన ఉద్రేకపూరిత ప్రసంగంలో జవహరి ఈ పిలుపునిచ్చాడు. ఈ ప్రసంగం వీడియో టేపులను అమెరికా నిఘా వర్గాలు సంపాదించాయి. దాదాపు 72 నిమిషాల పాటు జవహరి చేసిన ప్రసంగాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా, దాన్ని సైట్ అనే నిఘాబృందం సంపాదించింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడుల్లో దాదాపు మూడువేల మంది మరణించగా, వారి స్మృత్యర్థం అమెరికా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన రోజునే జీహాదీ వెబ్సైట్లలో ఈ ప్రసంగాన్ని పోస్ట్ చేశారు.

''మనం అమెరికాను ఆర్థికంగా పూర్తిగా కుంగదీయాలి. అది తన భద్రతా రంగం మీద భారీ స్థాయిలో పెడుతున్న ఖర్చును మరింత పెంచేలా రెచ్చగొట్టాలి. తద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చాలి. తన సైనిక, భద్రతా వ్యయాన్ని ఎక్కువ చేయడం వల్ల ఇప్పటికే అమెరికా పరిస్థితి డోలాయమానంలో పడింది'' అని జవహరి చెప్పాడు. అక్కడక్కడ కొన్ని దాడులు చేస్తే చాలు.. అమెరికా భయాందోళనలకు గురవుతుందని.. సోమాలియా, యెమెన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ లాంటి దేశాల్లో వాళ్లను మనం ఓడించినట్లే వాళ్ల సొంతదేశంలో కూడా ఓడించాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు.

ఒక సోదరుడు లేదా కొద్దిమంది సోదరులు ఈ దాడులు చేస్తే సరిపోతుందని జవహరి చెప్పాడు. సరైన సమయం చూసి భారీస్థాయిలో దాడికి తెగబడాలని కూడా తెలిపాడు. చిన్న చిన్న దాడులు చేస్తూ భారీ దాడి కోసం ఓపిగ్గా వేచిచూడాలని.. అవసరమైతే అందుకు కొన్ని సంవత్సరాలు కూడా ఆగాలని చెప్పాడు. ఏప్రిల్ నెలలో బోస్టన్ మారథాన్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లను కూడా జవహరి ప్రస్తావించాడు. దాన్ని బట్టి చూస్తే అమెరికన్లు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు తెలుస్తోందని.. వాళ్ల పొగరు చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు. వాళ్ల దృష్టి మొత్తం ముస్లింల మీదే ఉంది తప్ప మరెవ్వరి మీదా కాదని చెప్పాడు. సిరియాలో ఉన్న జీహాదీలో ముస్లిమేతరులకు సాయం చేయద్దని కూడా జవహరి ఇదే ప్రసంగంలో తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement