నోబెల్ 'శాంతి' రేసులో ట్రంప్
టాల్లిన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం రికార్డు స్థాయిలో 376 నామినేషన్లు అందాయని నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. అందులో 228 మంది వ్యక్తులు కాగా, 148 మంది సంస్థలు ఉన్నాయని మంగళవారం తెలిపింది. ఇంతకుముందు 2014లో 278 నామినేషన్లు వచ్చాయి. ఈసారి కొత్త రికార్డు నమోదైంది. విజేతను ఎంపిక చేసే ప్రక్రియను నోబెల్ కమిటీ త్వరలో ప్రారంభించనుంది.
వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, గతంలో శాంతి బహుమతి అందుకున్న వాళ్లు, ఇతరులు ఈ నామినేషన్లు పంపిస్తారు. బహుమతి రేసులో ఉండే అభ్యర్థుల వివరాలను నోబెల్ కమిటీ 50 ఏళ్ల వరకూ రహస్యంగా ఉంచుతుంది. అయితే.. కొన్నిసార్లు అభ్యర్థుల తరఫున నామినేషన్లు పంపిన వారు తాము ఎవరిని సూచించామన్న విషయాన్ని ప్రజలకు వెల్లడిస్తుంటారు.
ఈ ఏడాది శాంతి బహుమతి రేసులో ఉన్న వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, ఐసిస్ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కల్, పోప్ ఫ్రాన్సిస్, అమెరికా నటి, హక్కుల కార్యకర్త సుసాన్ సరాండన్, కొలంబియా శాంతి చర్చల సంప్రదింపుల బృందం, అఫ్ఘానిస్తాన్ మహిళా సైక్లింగ్ టీమ్‌ల పేర్లు బహిర్గతమయ్యాయి.