దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిడిలు ఎదురౌతున్నా ఉత్తర కొరియా మాత్రం తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. బుధవారం రెండు మధ్యతరహా 'ముసుడాన్' క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా, అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ తరహా ప్రయోగాలను ఇంతకు ముందు నాలుగుసార్లు ఉత్తర కొరయా నిర్వహించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మరోసారి ఈ ప్రయోగాలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ రెండు క్షిపణి ప్రయోగాలు కూడా ఉత్తర కొరయాకు నిరాశనే మిగిల్చినట్లు తెలుస్తోంది. ఇవాళ్టి ప్రయోగంలో మొదటి క్షిపణి ప్రయోగం పూర్తిగా విఫలం కాగా.. రెండో క్షిపణి మాత్రం కేవలం 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సౌత్ కోరియా జాయింట్ చీఫ్ స్టాఫ్ వెల్లడించింది. మధ్యతరహా క్షిపణుల 3,500 కిలోమీటర్ల లక్ష్యానికి ఉత్తర కొరియా చాలా దూరంలోనే నిలిచిపోయినట్లు వారు వెల్లడించారు.