సాక్షి : ఉత్తర కొరియా అణు పరీక్షలను అంతర్జాతీయ సమాజం మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా అధ్యక్షుడు కిమ్ జంగ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. వరుసగా అణు క్షిపణులను ప్రయోగిస్తూ పొరుగు దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాడు.
పద్ధతి మార్చుకోకపోతే యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మున్ముందు కిమ్ కవ్వింపు చర్యలు పెరిగే ఆస్కారం ఉందన్న సంకేతాలను దక్షిణ కొరియా అందజేస్తోంది. అక్టోబర్ నెలలో డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా వార్షికోత్సవ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా 10, 18 తేదీల్లో ప్యోంగ్‌యాంగ్‌లో నిర్వహించబోయే వేడుకల్లో క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ద.కొ. అంచనా వేస్తోంది. గురువారం అధ్యక్షుడు మూన్ జాయె ఇన్‌తో భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ యూ యోంగ్ ఓ ప్రకటన చేశారు.
ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పరిస్థితి యుద్ధానికి దారి తీయవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా మాదిరి యుద్దానికి తామూ ఉవ్విళ్లూరటం లేదన్న విషయాన్ని ఇప్పటికే దక్షిణ కొరియా స్పష్టం చేసింది. అయినప్పటికీ యూఎస్ భద్రతా దళాలు మాత్రం సియోల్ ఉత్తర భాగంలో భారీగా మోహరింపులు చేస్తోంది. మరోవైపు ఉంటే ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతం ఖసన్‌లో ఇప్పటికే రష్యా తన సైన్యాన్ని దించటంతో మున్ముందు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.