కరపత్రాలు సిద్ధం చేస్తున్న ఉ. కొరియా సిబ్బంది(కర్టెసీ: ఏఎఫ్‌పీ)
ప్యాంగ్‌యాంగ్: తమ దేశం గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న దక్షిణ కొరియాకు కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యామని ఉత్తర కొరియా తెలిపింది. ఇందుకోసం వేలాది గాలిబుడగలు, లక్షలాది కరపత్రాలను సిద్ధం చేసినట్లు సోమవారం వెల్లడించింది. కాగా ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ విధానాలను నిరసిస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు గాలిబుడగల్లో కరపత్రాలు నింపి సరిహద్దుల్లో వదిలిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాలో ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని.. అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతుందని కరపత్రాల్లో రాసి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన కిమ్ సోదరి కిమ్ యో జాంగ్.. తమ దేశప్రజలను కట్టడి చేయకుంటే దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధమవుతామని హెచ్చరించారు. శత్రుదేశానికి బుద్ధి చెప్పి తీరుతామని స్పష్టం చేశారు.(అన్నంత పని చేసిన కిమ్ సోదరి!)
ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య చర్చలకు వేదికైన అనుసంధాన భవనాన్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. ఈ నేపథ్యంలో ఉభయ కొరియాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా దక్షిణ కొరియాకు వారి స్టైల్లోనే సమాధానం చెబుతామంటూ.. ‘యాంటీ- సౌత్ లీఫ్లెట్ క్యాంపెయిన్’కు ఉత్తర కొరియా తెరతీసింది. మూడువేలకు పైగా బెలూన్లు, దాదాపు కోటి కరపత్రాలు సౌత్‌కొరియాలో వెదజల్లేందుకు సిద్ధమైనట్లు అధికార మీడియా వేదికగా వెల్లడించింది. ఇలాంటి చర్యలు ఎంత చిరాకు తెప్సిస్తాయో, బాధను కలిగిస్తాయో ఇప్పుడు వారికి బాగా అర్థమవుతుందని పేర్కొంది. చేసిన తప్పుకు దక్షిణ కొరియా శిక్ష అనుభవించక తప్పదని.. అన్ని విధాలా సిద్ధంగా ఉండాలంటూ మరోసారి హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment