వాషింగ్టన్/న్యూయార్క్ : ఉత్తర కొరియా ఒకవేళ విధ్వంస కాండకు సిద్ధమైతే... ఆసియా దేశాలన్నీ తమ అణు ఆయుధాలను బయటకు తీయాల్సి ఉంటుందని అమెరికా రక్షణ నిపుణుడు హెన్రీ ఆర్ కిస్సింగర్ చెబుతున్నారు. ఈ మేరకు ఆసియా దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఈ అమెరికా మాజీ రక్షణ అధికారి చెబుతున్నారు.
‘‘తమ దగ్గర మాత్రమే అణు ఆయుధాలు ఉన్నాయని ఉత్తర కొరియా విర్రవీగుతోంది. కానీ, వాటి స్థాయికి కాకపోయినా పొరుగున ఉన్న మరికొన్ని దేశాలు కూడా శక్తివంతమైన క్షిపణులనే కలిగి ఉన్నాయి. అన్ని కలిస్తేనే కిమ్ మెడలు వంచటం సాధ్యమౌతుంది’’ అని హెన్సీ వ్యాఖ్యానించారు. వివాదాస్పద దౌత్యవేత్తగా పేరున్న ఈ మాజీ రక్షణాధికారి, నిక్సన్ హయాంలో కుట్రలకు పాల్పడ్డాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. అయితే సమర్థవంతమైన రక్షణ నిపుణుడిగా పేరుండటంతో అవి పెద్దగా నిలవలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన తన సలహాలను మీడియా ద్వారా ఆయన సూచిస్తున్నారు.
ఇంకా ఆయన ఏం చెప్పారంటే... గత తొమ్మిది నెలల్లో ఏకంగా 15 పరీక్షలు నిర్వహించారు. వీటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణుల్లో కొన్ని జపాన్ మీదుగా ప్రయాణించాయి. సెప్టెంబరులో నిర్వహించిన అణు పరీక్షతో చైనా సరిహద్దు వెంబడి భూమి కంపించింది. దక్షిణ కొరియా సరిహద్దులో కూడా ప్రకంపనలు వచ్చాయి. వాటి ప్రభావాన్ని బట్టి అవి బాగా శక్తివంతమైనవనే తెలుస్తోంది. కిమ్ వద్ద న్యూయార్క్‌ను చేరుకునే క్షిపణి కూడా ఉన్నట్లు స్పష్టమౌతోంది అని అన్నారు.
ప్రభావం ఎంతలా అంటే...
మరోవైపు అమెరికా న్యూస్ ఏజెన్సీ ఏబీసీ కూడా కిమ్ విధ్వంసంకాండపై పరిశీలకుల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించింది. దీనికి సమాధానంగా కొన్ని న్యూస్ ఏజెన్సీలు పరిశోధన చేసి కొన్ని విషయాలు వెల్లడించాయి.
- స్కడ్ (సిరీస్ ఆఫ్ టాక్టికల్ మిసైల్)... జపాన్‌లోని ఒసాకాను, దక్షిణా కొరియాను తాకే సామర్థ్యం ఉంది.
- మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ క్షిపణుల పరిధిలోకి టోక్యోతోపాటు జపాన్‌లోని ఇతర నగరాలను, ఈశాన్య చైనా, తూర్పు మంగోలియా, ఆగ్నేయ రష్యాలు తాకగలవు.
- ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు చైనాలోని చాలా నగరాలను ధ్వంసం చేయగలవు. అలాగే తూర్పు రష్యా, ఆగ్నేయాసియాలోని థాయిలాండ్, ఫిలిప్పైన్స్, అమెరికాలోని గువామ్‌లను చేరుకునే శక్తి ఉంది.
- ఇక కీలకమైనవి, అతి ప్రమాదకరమైనవి ఖండాంతర క్షిపణులు. చాలా వరకు మధ్య ప్రాచ్య దేశాలు, ఈశాన్య ఇటలీ, స్కాట్లాండ్, పశ్చిమ ఇంగ్లండ్, ఈశాన్య ఈజిప్ట్, పశ్చిమ సోమాలియా, అలస్కా, అమెరికా, కెనడా, ఇండియా, తూర్పు యూరోప్, టర్కీ, గ్రీస్, స్కాండనేవియా, ఆస్ట్రేలియాలో చాలా వరకు నగరాలను ధ్వంసం చేయగలవు.
ఇలా ఉత్తర కొరియా వద్ద నున్న పలు రకాల క్షిపణులు ప్రతీ దేశంలోని ఏదో ఒక మూలను తాకే సామర్థ్యం ఉన్నాయనే అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన్న కిమ్ పరీక్షిస్తున్న క్షిపణులు అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను చేరుకోగలవన్నది వాస్తవమేనని ఆ కథనాల సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment