
'యూరప్ లక్ష్యంగా తీవ్రవాదుల దాడులు'
పారిస్: బెల్జియం రాజధాని బ్రసెల్స్లో తీవ్రవాదుల ఆత్మాహుతి దాడులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే మంగళవారం స్పందించారు. బెల్జియం మాత్రమే కాదు.. యూరప్ లక్ష్యంగా తీవ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని హాలండే పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన ఓ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదుల దాడులతో బ్రసెల్స్ అస్తవ్యస్థమైంది. ఈ దాడులపై ఒక్క యూరప్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. నిన్న ఫ్రాన్స్, నేడు బెల్జియంపై దాడులు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సమిష్టిగా తీవ్రవాదంపై పోరాడాల్సి ఉందని సూచించారు.
ఈ బాంబు దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం పోర్టులు, స్టేషన్లు, విమానశ్రయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను బలోపేతం చేసినట్టు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 28 మంది దుర్మరణం చెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ఒకింత అనుమానాలకు తావిస్తోంది. కాగా, నవంబర్‌లో ప్యారిస్ లో తీవ్రవాదులు జరిపిన మారణహోమంలో 130 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.