ఇక ట్విట్టర్లో పాటలూ వినొచ్చు!
ట్విట్టర్ ఇక మీదట కూతలే కాదు.. పాటలు కూడా పాడుతుంది. అవును. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన యూజర్ల కోసం ఓ కొత్త ఆప్షన్ ప్రారంభించింది. నేరుగా తమ మొబైల్ ఫోన్లలోని ట్విట్టర్ అకౌంట్ నుంచి యూజర్లు పాటలు వినచ్చు. బెర్లిన్కు చెందిన సౌండ్క్లౌడ్ అనే ఆడియో స్ట్రీమింగ్ సర్వీసు సహకారంతో ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు ప్లాట్ ఫారాల మీద అందిస్తున్న 'ట్విట్టర్ ఆడియోకార్డ్' ద్వారా ఈ పాటలు వినచ్చు. సంగీత ప్రియులకు ఈ ఆప్షన్ ఎంతగానో నచ్చుతుందని ట్విట్టర్ ఆశిస్తోంది.
ప్రస్తుతానికి తాము కేవలం ఆడియోకార్డును పరీక్షిస్తున్నామని, త్వరలో మరింతమంది భాగస్వాములకు దీన్ని అందుబాటులోకి తెస్తామని ట్విట్టర్ ఓ బ్లాగ్ పోస్టులో తెలిపింది. త్వరలోనే లక్షలాది మంది యూజర్లకు పాటలు వినే అవకాశం కల్పిస్తామంది. ట్విట్టర్ యాప్ వాడినంతసేపూ ఈ ఆడియో కార్డ్ ద్వారా సంగీతం వినొచ్చని వివరించారు. సౌండ్ క్లౌడ్లో భాగస్వాములుగా ఉన్న నాసా, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, డేవిడ్ గెట్టా, కోల్డ్ ప్లే, వార్నర్ మ్యూజిక్, డైలీ మెయిల్.. ఇలాంటి అనేక వనరుల నుంచి ట్విట్టర్ మ్యూజిక్ వినచ్చు.