అణు భద్రతే మా ప్రాధాన్యం! | Nuclear security is our priority! | Sakshi
Sakshi News home page

అణు భద్రతే మా ప్రాధాన్యం!

Published Sun, Apr 3 2016 12:54 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

అణు భద్రతే మా ప్రాధాన్యం! - Sakshi

అణు భద్రతే మా ప్రాధాన్యం!

అణు భద్రత సదస్సులో ప్రధాని మోదీ
♦ అణు స్మగ్లింగ్ అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ
♦ సౌదీ చేరుకున్న ప్రధాని
 
వాషింగ్టన్: అణు భద్రతను భారత్ జాతీయ ప్రాధాన్యంగా గుర్తించి పటిష్టమైన సంస్థాగత ప్రణాళిక, స్వతంత్ర నియంత్రణ వ్యవస్థతో ముందుకెళ్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాలో జరుగుతున్న అణు భద్రత సదస్సు చివరి రోజు ప్రసంగంలో.. అణువ్యాప్తి నిరోధం, భద్రత అంశాలపై భారత్ తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. సుశిక్షితులైన, ప్రత్యేకమైన సిబ్బంది నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తోందన్నారు. అణు ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు అక్రమ రవాణాను అడ్డుకోవటం, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటంపైనా భారత్ ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. 

అణు స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ‘అణు ఉగ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ చొరవ’ పేరుతో 2017లో జరిగే సమావేశాన్ని భారత్‌లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2005లో ‘భారీ నష్టం చేసే ఆయుధాలు, వాటి సరఫరా వ్యవస్థ చట్టం’ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలను భారత్ అమలు చేస్తోందని మోదీ వెల్లడించారు. సదస్సు ముగిసిన తర్వాత బ్రిటన్ ప్రధాని కామెరాన్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకురానున్న టూటైర్ వీసా విధానం వల్ల తలెత్తే ఇబ్బందులను కామెరాన్‌తో చర్చించారు. కాగా, ప్రభుత్వేతరుల చేతికి అణుశక్తి చేరటంలో అన్ని దేశాలు కఠినంగా వ్యవహరించాలని అణుభద్రత సదస్సుకు వచ్చిన అన్ని దేశాలు సంయుక్తంగా తీర్మానించాయి. కాగా సదస్సు వేదిక వద్ద సిక్కు వేర్పాటువాద నాయకులు నిరసన చేపట్టారు.

 సౌదీలో మోదీ.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం  సౌదీకి చేరుకున్న మోదీకి ఆదేశ యువరాజు ఫైజల్ అజీజ్  ఘన స్వాగతం పలికారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో సహకారంతోపాటు పలు కీలకాంశాలపై సౌదీతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోనున్నారు.  ఇస్లాం సంస్కృతికి కేంద్రమైన సౌదీ ఇటీవలే 34 ముస్లిం దేశాలతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు సౌదీలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతోనూ ప్రధాని సమావేశం కానున్నారు. సౌదీలో విమానం దిగిన తర్వాత రియాద్‌లో మట్టి ఇటుకలతో కట్టిన ‘మస్మక్ కోట’ను మోదీ సందర్శించారు. అనూహ్యంగా ప్రధాని మోదీ ఎల్‌అండ్‌టీ కంపెనీ ఉద్యోగులతో కలసి అల్పాహారం చేసి కాసేపు ముచ్చటించారు.

 రాజకీయ సుస్థిరత వల్లే భారత్ వృద్ధి..
 భారతదేశంలోని రాజకీయ స్థిరత వల్లే దేశం వృద్ధి సాధ్యమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు. రియాద్‌లో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రపంచదేశాల ఆర్థికపరిస్థితి దిగజారుతుండటంతో.. వారందరికీ భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు. తెలివైన మానవవనరులు, ఆధునిక నైపుణ్యం వంటి విషయాల్లో ప్రపంచానికి భారత్ ఇవ్వాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు. సౌదీలో 30 లక్షల మంది భారతీయలు పనిచేస్తున్నారంటే మన యువత ఎంత ప్రతిభావంతమైంతో.. అర్థమవుతుందన్నారు. ప్రపంచంలో ఒక దేశంగా ఉన్న భారత్ నేడు.. ఓ ముఖ్యమైన దేశంగా మారిందన్నారు. ‘భారతదేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అద్భుతమైన ప్రగతినిసాధిస్తోంది’ అని వెల్లడించారు. ‘మైగవ్’ వెబ్‌సైట్, నరేంద్రమోదీ యాప్ మీ దగ్గరుంటే నేను ‘మీ పాకెట్లో ఉన్నట్లే’ అని మోదీ అన్నారు.
 
 భారత్-పాక్ ఆయుధాలు తగ్గించాలి: ఒబామా
 వాషింగ్టన్: తమ అమ్ములపొదిలోని అణ్వాయుధాలు తగ్గించుకునేందుకు భారత్, పాక్‌లు ముందుకు రావాలనిఅమెరికా అధ్యక్షుడు ఒబామా అణుభద్రత సదస్సులో సూచించారు. మిలటరీ సిద్ధాంతాలకు అనుగుణంగా పెంచుకుంటున్న అణు సంపత్తిని తప్పుడు పనులకు వినియోగించమని భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలున్న అమెరికా,రష్యా తమ ఆయుధ సంపత్తిని తగ్గించుకుంటే తప్ప మిగిలిన దేశాలు ముందుకు రావన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement