ఫ్రాన్స్, బెల్జియంపై ఒబామా ప్రశంసలు
వాషింగ్టన్: ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు. ఫ్రాన్స్లో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడికి సంబంధించి కీలక అనుమానితుడు సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒబామా స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, బెల్జియ ప్రధాని చార్లెస్ మైఖెల్ కు ఫోన్ చేసి మరి అభినందనలు తెలిపినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది.
కఠోర శ్రమ, చక్కటి సహకారం, ఫ్రాన్స్ న్యాయ వర్గాల వల్లే నేడు ఈ కీలకమైన అరెస్టు జరిగిందని ఒబామా చెప్పినట్లు తెలిపారు. తమ మద్దతు ఎప్పటికీ ఆ రెండు దేశాలకు ఉంటుందని అన్నారు. ప్యారిస్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పలుచోట్ల దాడులకు పాల్పడటంతో దాదాపు 130మంది అమాయకులు బలయ్యారు. ఈ దాడిని చాలా సీరియస్ గా తీసుకున్న ఫ్రాన్స్ ఎట్టకేలకు ఓ కీలక అనుమానితుడిని అరెస్టు చేసింది.