
అతడి తల విలువ రూ.33 కోట్లుపైనే!
న్యూయార్క్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది అబు మహ్మద్ అల్ షిమాలి అలియాస్ తిరద్ అల్ జర్బాపై అమెరికా భారీ మొత్తంలో రివార్డు ప్రకటించింది. అతడి సమాచారం తెలిపిన వారికి దాదాపు రూ.33 కోట్లకుపైగా చెల్లిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా గత రాత్రి ఆమోదం తెలిపారు. జర్బా అమెరికా, యూరప్ దేశాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు నిధులను సేకరించడంలో కీలకమైనవాడు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అల్ కయిదా ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేసిన 2005 సంవత్సరం నుంచి జర్బా ఇస్లామిక్ స్టేట్ లో చేరాడు. అప్పటి నుంచి సిరియాలో ఉన్న తమ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగే విదేశీ సైన్య వ్యూహాలను ముందుగానే పసిగట్టడంలో నష్టాన్ని అంఛనా వేసి ఆ మేరకు భర్తీ చేయగలగడంలో మంచి నేర్పరి. ఓ రకంగా ఉగ్రవాదులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి ఇతడే కారణమని కూడా అమెరికా బలగాలు నమ్ముతున్నాయి. అంతేకాదు, ఇతర దేశాలపైకి దాడులకు వెళ్లాలనుకున్నప్పుడు ఏయే ప్రాంతాలనుంచి వెళ్లాలనే విషయాలను చెప్పడంతోపాటు ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలు కూడా జర్బానే చూసుకుంటాడట. అందుకే, అతడిని గుర్తించి మట్టుబెడితే ఇస్లామిక్ స్టేట్ కు గండికొట్టినట్లవుతుందని అమెరికా భావిస్తోంది.