
ప్రతీకాత్మక చిత్రం
టోక్యో/కోబె : రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని, అతి త్వరగా తేరుకుని.. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన జపాన్‌ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి. అక్కడ నియమాలు, నిబంధనలు పక్కాగా అమలు చేస్తారు. అయితే, ఓ అరవై నాలుగేళ్ల వృద్ధ ఉద్యోగి పట్ల అక్కడి అధికారుల తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. విరామానికి ముందే లంచ్‌కి వెళ్లాడని సదరు ఉద్యోగికి ఒకరోజు వేతనంలో సగం కోత విధించారు. దాంతో పాటు మీడియా ముందు గురువారం అతనితో క్షమాపణలు చెప్పించారు.
కోబె సిటీ అధికార ప్రతినిధి తెలిపిన వివరాలు.. కోబె వాటర్‌వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి లంచ్ విరామానికి (మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు) మూడు నిమిషాలు ముందు బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. అలా అతను 7 నెలల కాలంలో 26 సార్లు నిబంధనలను అతిక్రమించాడు. ‘ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తూ ఇలా చేయడం నిజంగా విచారకరం’అంటూ మీడియా సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు మాటిమాటికి సిగరెట్ తాగడానికి వెళితే అప్పుడు నిబంధనల ఉల్లంఘన గుర్తుకు రాదా అని అధికారుల తీరుపై కొందరు ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే టాయ్‌లెట్‌కు కూడా పోనిచ్చేలా లేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, లంచ్ విరామంలో కాకుండా పని వేళల్లో భోజనానికి వెళ్తున్నాడనే కారణంతో ఫిబ్రవరిలో ఓ ఉద్యోయోగిని నెల రోజుల పాటు విధుల నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment