
పాక్‌లో ఉగ్రదాడి : 59 మంది పోలీసులు మృతి
క్వెట్టా: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసుల శిక్షణా శిబిరంపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మాహుతి జాకెట్లతో శిక్షణా శిబిరంలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 59 మంది పోలీసులు దుర్మరణం చెందగా... పలువురు తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ముందుగా వాచ్ టవర్ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తరువాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది.
ఈ దాడి సమయంలో పోలీసుల శిక్షణా శిబిరంలో 600మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే జంగవి ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.