ఆన్‌లైన్‌లో పుర్రెల వేలం!
లండన్: ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ సంస్థలు సెల్‌ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఆహార పదార్థాలు వంటివి అమ్ముతాయని మనకు తెలుసు. కానీ పుర్రెలు కూడా అమ్ముతాయని తెలుసా. అవును ఇది నమ్మలేని నిజం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే అదే పని చేసింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్‌లైన్‌లో వేలం పెట్టే ఈ సంస్థ పుర్రెలను వేలానికి పెట్టింది. పుర్రెల్లో ఇండియా, చైనాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 237 మంది 454 పుర్రెలను అమ్మకానికి ఉంచారు.
అమ్మకానికి ఉంచిన వారిలో అమెరికాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలలుగా పుర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో అత్యధికంగా ఒక పుర్రె రూ. 3 లక్షలు పలకగా, ఇంకొక పుర్రె తక్కువగా రూ.50 వేలు పలికింది. ఇంతకు ఈ పుర్రెలను ఏం చేస్తారనుకుంటున్నారా..వీటిని వైద్య ప్రయోగాలకు ఉపయోగిస్తామంటున్నారు. కానీ ఈ పుర్రెలు పురావస్తు తవ్వకాల్లో దొరికినట్టుగా కొందరు అనుమానిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈబే పుర్రెల అమ్మకాన్ని నిషేధించింది.