నేనే ఉంటే..  ఎవరో ఎందుకు? | Special story to stand up comedian Prassthis Singh | Sakshi
Sakshi News home page

నేనే ఉంటే..  ఎవరో ఎందుకు?

Published Wed, Sep 12 2018 12:09 AM | Last Updated on Wed, Sep 12 2018 12:09 AM

Special story to stand up comedian Prassthis Singh - Sakshi

స్టాండప్‌ కమెడియన్‌ ప్రశస్తీ సింగ్‌

జీవితంలో మనం ఎన్నింటినో ప్రేమిస్తాం. ఆ ప్రేమలు బ్రేక్‌ అయినప్పుడు మనసును ముక్కలు చేసుకుంటాం. మరి మనల్ని ప్రేమిస్తున్న మన జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేం. మనల్ని మనం ప్రేమించుకోవాలన్న స్పృహ లేకపోతే జీవితం మనల్ని ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించలేం. ఈ వాస్తవాన్ని ప్రశస్తి అనే యువతి గ్రహించింది. గ్రహించి ఏం చేసింది?!

అవతలి వాళ్ల బలహీనతల మీద కాదు.. మన ఇబ్బందుల మీద చలోక్తులు విసురుకుని నవ్వించేవాళ్లే హీరోలు! అవే హెల్తీ జోక్స్‌! ఆ పనే చేస్తోంది ప్రశస్తీ సింగ్‌. ఆమె సొంతూరు లక్నో. కాలేజ్‌ చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. ఆ టైమ్‌లోనే ఐఐటీ చదివే అబ్బాయితో ప్రేమలో పడింది. ఉద్యోగరీత్యా అతను లండన్‌ వెళ్లాక కూడా ఆ రిలేషన్‌షిప్‌ కొనసాగింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లయ్యాక అతనితో లండన్‌ వెళ్లిపోయి.. అక్కడ తనకు ఇష్టమైన కప్‌ కేక్‌ షాప్‌ తెరవాలనుకుంది. దాని గురించి కలలే కాదు.. ప్రయత్నాలూ  మొదలుపెట్టింది. ‘‘ఆఫ్టర్‌ ఆల్‌ ఫస్ట్‌ లవ్‌ ఈజ్‌ ద బెస్ట్‌ లవ్‌ కదా ’’ అని మురిసిపోయింది. 

హార్ట్‌ ఎటాక్‌.. హార్ట్‌ బ్రేక్‌
జీవితాన్ని మించిన పజిల్‌ ఉంటుందా?  ఏ క్షణం ఏ మలుపులో నిలబెడుతుందో తెలీదు. ప్రశస్తి విషయంలోనూ అదే జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్‌ లండన్‌ వెళ్లిపోయాక తనూ జాబ్‌ కోసం బెంగళూరు వెళ్లింది.  ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఐఐఎమ్‌ కోసం ప్రిపేర్‌ అవుతోంది. అంతలోనే ఒక రాత్రి లక్నో నుంచి ఫోన్‌ కాల్‌.. హార్ట్‌ఎటాక్‌తో తండ్రి చనిపోయాడని. పరిగెత్తింది. కుప్పకూలిన తల్లిని సంభాళించింది. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం నుంచి బయటపడ్డానికి తనకూ టైమ్‌ పట్టేలా ఉంది. ఒక్క రాత్రిలోనే ఎంతగానో ఎదిగిపోయిన భావన ప్రశస్తిలో. ఈ విషాదాన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. అసలు తన కుటుంబం ఆస్తిపాస్తుల మీదా అవగాహన లేదు తనకు. ఆ యేడాదే లక్నో ఐఐఎమ్‌లో సీట్‌ వచ్చింది. కాస్త ఊరట దొరికినట్టయింది ప్రశస్తికి. కుటుంబంతో కలిసి లక్నోలో ఉండే వెసులుబాటు. కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఆమె బాధలో భాగం పంచుకోలేదు. స్వార్థంగా ఆలోచించాడు. ఆమెతో రిలేషన్‌ను బ్రేక్‌ చేసుకున్నాడు. మూడునెలలు కుమిలి కుమిలి ఏడ్చింది. అప్పుడు అర్థమైంది ఆమెకు.. అప్పటిదాకా ఎవరో ఒకరి మీద ఆధారపడే ఉంది తను. తండ్రి లేదంటే.. బాయ్‌ఫ్రెండ్‌. తన శక్తేంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు!

సింగిల్‌@ 26
ఐఐఎమ్‌ చదువు.. ఆమె దిగులును ఎన్నో రోజులు కంటిన్యూ చేయలేదు. మేనేజ్‌మెంట్‌ డిగ్రీని సీరియస్‌గా తీసుకుంది. పూర్తయ్యాక ముంబై వెళ్లింది. ఓ ప్రైవేట్‌ టీవీ చానల్‌లో చేరింది. క్రియేటివ్‌ రైటర్‌గా ఆ జాబ్‌ బాగానే ఉంది. ఇంటి నుంచీ ఇంకో పోరు మొదలైంది. 26 ఏళ్లొచ్చాయి.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌? అంటూ. అప్పటికి తన ఫ్రెండ్స్‌ అంతా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. తనే ఒంటరిగా ఉంది. అవును.. నిజమే వయసు మీద పడుతోంది పెళ్లి కావాలి అని ఆన్‌లైన్‌లో అబ్బాయిని వెదుక్కోవడం మొదలుపెట్టింది.

వావ్‌.. ప్రశస్తి!
ఆన్‌లైన్‌ డేటింగ్‌తో అబ్బాయిల వికారాలన్నీ తెలుస్తున్నాయి ప్రశస్తికి. ఒక్కొక్క మానవుడి ఆలోచన ఒక్కో రీతి. ఒకరికి కులం కావాలి.. ఇంకొకరికి గోత్రం పట్టింపు. మరొకరికి కట్నం. వేరొకరికి సంప్రదాయం.. అయిదో వ్యక్తి ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాల చరిత్ర ఇంపార్టెంట్‌..    అన్నిరకాలుగా ఓకే  అనుకున్న ఆఖరి వ్యక్తి అయిన, పెళ్లి కాకుండా మిగతా వాటన్నిటికీ సిద్ధమని చెప్పాడు. చిరాకేసింది ప్రశస్తికి. తనకు నచ్చేవాడు దొరకలేదు కానీ.. ఆ ప్రాసెస్‌లో బోలెడంత కామెడీ కనిపించింది ఆమెకు. వాటినే చిన్న చిన్న సంఘటనలుగా మలిచి కొలీగ్స్‌ బర్త్‌డేస్, మ్యారేజ్‌ డేస్‌ పార్టీలు, ఫ్రెండ్స్‌తో గెట్‌ టు గెదర్స్‌ అప్పుడు కామెడీ షోస్‌ చేయడం మొదలు పెట్టింది. వాళ్లంతా ఆ కామెడీని బాగా ఎంజాయ్‌ చేశారు. ఫ్రెండ్స్‌ ద్వారా ఆ విషయం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్స్‌కీ తెలిసి.. స్టాండప్‌ కామెడీ కోసం ఆఫర్స్‌ పంపారు. అప్పటికప్పుడు రాసుకునే తన స్క్రిప్ట్‌.. కామెడీకి ఉన్న, వస్తున్న క్రేజ్‌ చూసుకొని తనకు తనే ‘‘వావ్‌ ప్రశస్తి!’’ అనుకుంది ఆమె. దాన్ని పార్ట్‌టైమ్‌ జాబ్‌గా చేసుకుంది. 

నైట్‌ టు ఫైవ్‌ 
తన ఉద్యోగాన్ని నైట్‌ టు ఫైవ్‌ షిఫ్ట్‌కి మార్చుకుని వారం రోజులు ప్రతి సాయంకాలాలు స్టాండప్‌ కామెడీని పండిస్తూ దాన్ని పార్ట్‌టైమ్‌ కెరీర్‌గా మలచుకుంది ప్రశస్తి. ‘‘ఇప్పుడు నాకు 30 ఏళ్లు. స్టిల్‌ సింగిల్‌. సో వాట్‌? ఐ యామ్‌ హ్యాపీ. నాకు కావల్సిన లక్షణాలను పార్ట్‌నర్‌లో వెతుక్కోవాలని పిచ్చి ప్రయత్నాలు చేశా. ఆ ప్రాసెస్‌లో పడి నన్ను నేను ప్రేమించుకోవడం మర్చిపోయా. థ్యాంక్‌ గాడ్‌.. ఆ పిచ్చి ప్రయత్నాలే నేను మేల్కొనేలా చేశాయి. నేను వెతుక్కున్న ఆ లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయని గ్రహించేలా చేశాయి. నన్నే నేను ప్రేమించుకునేలా చేశాయి. ఫస్ట్‌ లవ్‌ ఈజింట్‌ బెస్ట్‌ లవ్‌.. సెల్ఫ్‌ లవ్‌ ఈజ్‌’’ అంటుంది ప్రశస్తీ సింగ్‌. 
– శరాది


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement