ఆ సీన్ చూసే లాడెన్ 9/11 దాడులు
ప్రపంచాన్నే భయాందోళనలకు గురి చేసిన అమెరికా ట్విన్ టవర్స్ దాడికి స్పూర్తినిచ్చేలా చేసిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయడం ఒసామా బిన్ లాడెన్ సొంత ఆలోచన కాదని, ట్విన్ టవర్ల కూల్చివేతకు రెండు సంవత్సరాల ముందే మరో సంఘటన నుంచి అతడు స్పూర్తి పొందాడని ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్‌మస్రా' పత్రిక వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించి 'అన్‌టోల్డ్ స్టోరీ' పేరిట ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
అల్ మస్రా కథనం ప్రకారం.. 217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచి లాడెన్ స్పూర్తి పొంది అదే తరహాలో దాడులు నిర్వహించాలని భావించాడు. 9/11 దాడులకు రెండేళ్ల ముందు ఈజిప్టు ఎయిర్ ఫ్లైట్ 990 విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ విమానం లాస్‌ఏంజల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 217 మంది జల సమాధి అయ్యారు. వీరిలో దాదాపు సగం మంది అమెరికాకు చెందినవారే.
అయితే ఈ ప్రమాదం ఇంజన్ ఫెయిల్ కావటం వల్ల జరగిందని ఈజిప్టు విచారణాధికారులు తేల్చారు. కానీ, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మాత్రం ఎయిర్ ఫ్లైట్ 990 కో పైలెట్ 'జమీల్ ఆల్ బటౌటి' ఉద్దేశ పూర్వకంగానే విమానాన్ని నీటిలోకి దించాడని నిర్ధారించింది. ఈజిప్టు ఎయిర్‌లైన్స్ తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యలకు ప్రతీకారంగానే జమీల్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని కొందరు అంటూంటే, ఆత్మహత్మ అయ్యి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. అయితే జమీల్కు ఎలాంటి తీవ్రవాద లక్షణాలు లేవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు.
కానీ, ఈ సంఘటన నుంచి ఆల్‌ఖైదా అధ్యక్షుడు లాడెన్ స్పూర్తి పొంది, దీని నుంచే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేయాలనే గట్టిగా భావించారు. అయితే ఈజిప్ట్ విమానం వార్త 'ఆల్ మస్రా'లో వచ్చినప్పుడు దాన్ని చదువుతూ ఆవేశంతో పైలెట్ ఎందుకు భవనాన్ని ఢీకొట్టలేదని లాడెన్ అన్నాడని కథనంలో పేర్కొన్నారు.
ఆనాటి ట్విన్ టవర్స్ దాడులకు ప్రధాన పాత్ర పోషించింది ఖలీద్ షేక్ మహ్మద్ అని కమిషన్ రిపోర్టు తేల్చింది. మెదటగా మొత్తం 12 విమానాలతో దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. విమానాలతో దాడులు చేయించాలనే ఆలోచన లాడెన్దే అయినా అమెరికా విమానాలతోనే దాడులు చేయాలనే ఆలోచన ఖలీద్‌దే. వారి ముఖ్య లక్ష్యం వైట్‌హౌస్ లేదా క్యాపిటల్ బిల్డింగ్‌గా నిర్ణయించుకున్నారు. అయితే చివరకు నాలుగు విమానాలతోనే దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 3000 మంది అమాయక పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే.