ఒసామా బిన్ లాడెన్ కొడుకొచ్చాడు!
సిరియా: ప్రపంచంలో పాశ్చాత్య దేశాలను గడగడలాడించిన అంతర్జాతీయ టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్‌కు వారసుడొచ్చాడు. ఆయన 23 ఏళ్ల కుమారుడు హమ్జా బిన్ లాడెన్ తండ్రి బాటలో అల్ కాయిదా నాయకత్వం స్వీకరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా పాశ్చాత్య దేశాలను మట్టి కరిపించేందుకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా సిరియాలోని ముజాహిద్దీన్లంతా ఏకం కావాలంటూ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియా టేప్‌లో పిలుపునిచ్చాడు.
‘ఇస్లామిక్ ఉమ్మా (జాతి) అల్ శ్యామ్ (సిరియా)లోని జిహాదీపై దష్టిని కేంద్రీకరించాలి. ముజాహిద్దీన్లందరిని ఏకం చేయాలి. నేడు ముస్లిం ప్రపంచానికి వ్యతిరేకంగా మొత్తం ప్రపంచం ఏకమైంది. ఈ తరుణంలో విభేదాలకు, వివాదాలకు ఆస్కారం ఇవ్వరాదు. కలిసికట్టుగా పోరాడాలి’ అని హమ్జా పిలుపునిచ్చారు. ఆయన తన తండ్రికి ఇష్టమైన కవితతో తన సందేశాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్‌లోని అబ్బోటాబాద్‌లో అమెరికా కమాండో ఆపరేషన్లో తన తండ్రి ఒసామా బిన్ లాడెన్ హతమైన ఐదేళ్ల తర్వాత హమ్జా తొలిసారి లేదా రెండోసారి జిహాదీలను ఉద్దేశించి సందేశమిచ్చారు.
గతేడాది ఆగస్టు నెలలో హమ్జా పేరిట ఓ ఆడియో సందేశం విడుదలైంది. అది అతని సందేశం కాకపోవచ్చనే వార్తలు వెలువడ్డాయి. అప్పటి ఆ సందేశం పెద్దగా ప్రభావం చూపించలేదు. సిరియాలోని జిహాదీలంతా ఏకం కావాలంటూ ఒసామా బిన్ లాడెన్‌కు కుడిభుజంగా వ్యవహరించిన అల్ జవాహిరి శనివారం సందేశం ఇచ్చిన అనంతరం హమ్జా సందేశం కూడా విడుదల కావడం వల్ల నాయకత్వంవైపు హమ్జా అగుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అబ్బోటాబాద్ ఆపరేషన్లో తండ్రి ఒసామాతోపాటు హమ్జా బిన్ లాడెన్ కూడా మరణించారని తొలుత అమెరికా భావించింది. అయితే హమ్జాకు బదులుగా ఖలీద్ అనే మరో కొడుకు మరణించినట్లు తెల్సింది. ఆ ఆపరేషన్ సందర్భంగా హమ్జా అప్పుడు ఆ ఇంట్లో ఉండి, తప్పించుకొని పారిపోయాడా? లేక ఆ సమయంలో అక్కడ లేకుండా మరెక్కడైనా ఉన్నాడా? అన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే.
ఒసామా బిన్ లాడెన్ తన తదనంతరం హమ్జానే వార సుడు కావాలని కోరుకున్నాడని, అందులో భాగంగా హమ్జాకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ కూడా ఇచ్చారని పాశ్చాత్య ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు అంతర్గత గొడవలు, పాశ్చాత్య సంకీర్ణ దళాల దాడుల్లో ఇటీవల తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇస్లామిక్ స్టేట్ జిహాదీల తరఫున అల్ కాయిదా టెర్రరిస్టులు కూడా పోరాడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో హమ్జా అల్ కాయిదా నాయకుడిగా తెరమీదకు వస్తే జిహాదీలకు కొత్త ఊపు వస్తుందని, అది అమెరికాకు పెను ముప్పుగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.